అరెస్ట్ కోరుకుంటున్న చంద్రబాబు...నిజమేనా...?
రాజకీయాలలో ఢక్కామెక్కీలు తిన్న నాయకులు నారా చంద్రబాబునాయుడు. ఆయన ఏ మాట అన్నా దాని వెనక చాలా కధ కమామీషూ ఉంటాయని అంటారు
By: Tupaki Desk | 6 Sep 2023 8:27 AM GMTరాజకీయాలలో ఢక్కామెక్కీలు తిన్న నాయకులు నారా చంద్రబాబునాయుడు. ఆయన ఏ మాట అన్నా దాని వెనక చాలా కధ కమామీషూ ఉంటాయని అంటారు. బాబు నాలుగున్నర దశాబ్దాల రాజకీయాల్లో ఆరితేరిపోయారు. ఇక డూ ఆర్ డై అంటూ ముంచుకు వస్తున్న 2024 ఎన్నికల్లో నెగ్గడం కోసం బాబు గతానికి భిన్నంగా ఇంకా చెప్పాలంటే తన జీవితం మొత్తం ధారపోస్తూ ఈ రాజకీయంలో ఒడ్డుతున్నారు
మరి బాబు ఒడ్డెక్కుతారా లేదా అన్నది జనాల చేతులలో ఉంది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని ఆయన అరెస్ట్ కావడం ఖాయమని ఇప్పటిదాకా వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే బాబు అరెస్ట్ పడమరన సూర్యూడు ఉదయించడం ఈ రెండూ జరిగేవి కావని రాజకీయాల మీద ఆ మాత్రం అవగాహన ఉన్న వారు ఎవరైనా ఇట్టే చెబుతారు.
అయితే బాబు అరెస్ట్ అయితే చూడాలని ప్రత్యర్ధులకు ఉంది. కానీ బాబు అరెస్ట్ అవరు అన్న డౌట్లూ బోలెడు ఉన్నాయి. దానికి వారంతా అనే మాట ఒక్కటే. బాబు వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ఎలాగో నేర్చుకున్నారు. అందువల్లనే ఆయన తరచూ ఏదో విధంగా బయటపడిపోతున్నారు అని. అయితే ఇపుడు బాబు సైతం అరెస్ట్ అంటున్నారు. ఆయన నోట ఫస్ట్ టైం అరెస్ట్ మాట వస్తోంది.
దానికి డేట్ టైం కూడా ఆయనే చెప్పేశారు. నన్ను రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నారు. మీరంతా చూస్తూ ఉండండి అంటూ బాబు పార్టీ శ్రేణులకూ ప్రజలకు ఒక హింట్ అయితే ఇచ్చారు. బాబుని ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఒకవేళ చేస్తే ఏ కేసులలో అరెస్ట్ చేస్తారు అన్నది మాత్రం ఆయన చెప్పడంలేదు. బాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిన ఐటీ విభాగానికి అరెస్ట్ చేసే అధికారం లేదు, అయితే ఈడీకి సర్వాధికారాలు ఉన్నాయి.
ఈడీ ఈ కేసులో ఎంట్రీ ఇస్తే అపుడు అరెస్ట్ మాట ఉండవచ్చు. కానీ ఐటీ నోటీసులు షరా మామూలే అని టీడీపీ నేతలు సైలెంట్ అయిన వేళ ఈడీ దాకా కధ ఎందుకు వస్తుంది, అపుడు అరెస్టులు అన్న మాట కూడా ఎక్కడ ఉంటుంది అని అంటున్నారు. మరి బాబు అరెస్ట్ చేస్తారు అని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశించి అనరు. ఆయనకు ఆ విషయం కూడా తెలుసు.
పైగా కేంద్రంలోని పాలకుల పార్టీ అయిన బీజేపీతో చెలిమి కోరుకుంటున్న చంద్రబాబు ఆ పార్టీ వారి మీద డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా ఒక్క మాట కూడా అనరు, అనలేరు. సో బాబుని అరెస్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థల వైపు నుంచి కాదు. మరి ఎక్కడ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచే. అంటే ఏపీ సర్కారే తనను అరెస్ట్ చేస్తుంది అని బాబు అంటున్నారు అనుకోవాలి. అలాగే అనుమానిస్తున్నారు అనుకోవాలి.
ఎందుచేతా అంటే ఏపీ సీఐడీ ఇపుడే ఐటీ నోటీసులు అందుకున్న వారితో కలిపి అందరికీ నోటీసులు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ విషయంలో అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏపీ సీఐడీ విభాగం విచారణ జరుపుతోంది. ఇపుడు ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ ఆయన పీఏ శ్రీనివాస్, అలాగే ఎంపీవీ కి కూడా నోటీసులు ఇచ్చిన క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా వీరి పాత్ర ఉందని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది.
బహుశా ఈ కేసు మీదనే బాబు కామెంట్స్ చేసి ఉంటారు. ఆయన అనంతపురం జిల్లా టూర్ లో ఈ సంచలన కామెంట్స్ చేశారు. నేను నిప్పుని అని మరో మారు చాటుకున్నారు. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపైన దాడి చేస్తారని, అరెస్ట్ చేస్తారని అయినా తాను ఎక్కడా తలొగ్గేది లేదని బాబు స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే బాబు ఈ కేసులో ఏదో జరుగుతుందని ఊహిస్తున్నారా లేక అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారా లేక తన అరెస్ట్ అంటూ క్యాడర్ ని అప్రమత్తం చేయడం ద్వారా కొత్త రాజకీయ పాచికను వదులుతున్నారా అన్నది చూడాలి. ఏది ఏమైనా బాబు ఒక్క మాట అంటే వంద అర్ధాలు కూడా తీసుకోవాలి.
ఇక బాబుని ఈ వయసులో ఎన్నికలు సమీపిస్తున్న టైం లో అరెస్ట్ చేసి కొరివితో తలగోక్కోడానికి వైసీపీ పెద్దలు సిద్ధంగా ఉంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. బాబుని అరెస్ట్ చేస్తే సానుభూతి వెల్లువలా వస్తుందో రాదో తెలియదు కానీ దాని మీద నానా యాగీ చేసి జనాలలో అది అతి పెద్ద ఇష్యూ చేయడానికి టీడీపీ దాని అనుకూల మీడియా సిద్ధంగా ఉంటాయని వైసీపీకి తెలియనిది కాదు. అందువల్ల బాబు అరెస్ట్ అన్నది ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా తనను అరెస్ట్ చేస్తారు అని బాబు చెప్పుకోవడం వెనక ముందస్తు ప్లాన్స్ ఏవో ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి బాబు మాటల వెనక వ్యూహాలు ఏమున్నాయో.