తెలంగాణాలోకి టీడీపీ... రేవంత్ కి చెక్ నా ?
అలాగే ఏపీలో ప్రతిపక్షానికి పరిమితం అయి నానా ఇబ్బందులు పడుతూ వచ్చింది. అయితే టీడీపీకి ఇపుడు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు
By: Tupaki Desk | 9 Jun 2024 2:45 AM GMTతెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఉంది. అది అలా ఎదగాలని చూస్తోంది. పేరుకు రెండు రాష్ట్రాలలో ఉన్నా కూడా తెలంగాణాలో ఉనికి పోరాటం అవుతోంది. అలాగే ఏపీలో ప్రతిపక్షానికి పరిమితం అయి నానా ఇబ్బందులు పడుతూ వచ్చింది. అయితే టీడీపీకి ఇపుడు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు.
ఆ పార్టీ ఏపీలో వెరీ స్ట్రాంగ్ గా తయారైంది. ఆ పార్టీకి వచ్చిన సీట్లు చరిత్రలో ఎపుడూ రాలేదు. 144 సీట్లలో పోటీ చేస్తే 135 దాకా దక్కడం అంటే తొంభై అయిదు శాతం సక్సెస్ రేట్ ని సాధించింది అన్న మాట. ఎన్టీఆర్ టైం లో కూడా ఎనభై శాతం దాకా విజయాలు దక్కాయి కానీ ఇంతలా ఎన్నడూ లేదు.
దాంతో టీడీపీకి ఇపుడు ఎక్కడ లేని బలం వచ్చినట్లు అయింది. దాంతో ఏపీలో మరో దశాబ్దం వరకూ అధికారానికి ఢోకా లేదని టీడీపీ నిర్ధారణకు వచ్చినట్లుంది. దాంతో పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణా మీద దృష్టి సాగించింది. తెలంగాణాలో 2004లో అధికారం పోయింది. రెండు దశాబ్దాల కాలంలో టీడీపీ బాగా కుంచించుకుపోయింది.
ఆ పార్టీ 2004, 2009, 2014లలో సాధించిన ఓట్లూ సీట్లు 2018లో సాధించలేకపోయింది. 2023 ఎన్నికల్లో పోటీకే దూరం అయింది. దాంతో ఇపుడు ఏపీలో బలాన్ని చూపించి తెలంగాణాలో ఎదగాలని చూస్తోంది. దానికి తెలంగాణాలో రాజకీయ పరిస్థితులు కూడా కలసివస్తున్నాయి. బీఆర్ ఎస్ పుట్టుకతోనే టీడీపీ ఖాళీ అయింది. అలా రెండు దశాబ్దాల పాటు శాసించిన బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓటమితో వెనక్కి వచ్చింది.
ఇక 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. దాంతో బీఆర్ఎస్ పరిస్థితి మీద అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఓట్లు అన్నీ బీజేపీకి బదిలీ అయ్యాయి. అలా బీఆర్ఎస్ 22 శాతానికి పరిమితం అయితే బీజేపీ ఏకంగా 35 శాతం ఓట్లతో ఎనిమిది ఎంపీ సీట్లు సాధించింది.
ఈ మొత్తం పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ వచ్చిన టీడీపీ తెలంగాణాలో బీఆర్ఎస్ శకం ముగిసినట్లుగానే భావిస్తోంది. టీడీపీ రేసులో లేకపోవడం వల్లనే ఆ ఓట్లు బీజేపీ ఖాతాలోకి మళ్ళాయని కూడా అంచనా వేసుకుంటోంది. అదే టీడీపీ గట్టిగా నిలబడితే మళ్ళీ అక్కడ గత వైభవం దక్కుతుంది అని కూడా లెక్క వేసుకుంటోంది.
అయితే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. టీడీపీ అక్కడ బలంగా మారాలీ అంటే అధికార కాంగ్రెస్ మీద పోరాటం చేయాలి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే సవాల్ చేయాలి. ఒకనాటి చంద్రబాబు శిష్యుడి మీదనే టీడీపీ రాజకీయ యుద్ధం చేయాలి. అలా ఆయనకు చెక్ పెట్టాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే బీఆర్ ఎస్ వీక్ కావడంతో అందులో ఉన్నా మాజీ టీడీపీ తమ్ముళ్ళను టీడీపీలోకి తీసుకుని వచ్చేందుకు ప్రణాళికలను టీడీపీ రచిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు కీలక నేతలు బీఆర్ఎస్ నుంచి టీడీపీకి వచ్చేలా పావులు కదుపుతున్నారు. త్వరలో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణాలో పోటీ చేయడానికి టీడీపీ ప్రణాళికలు వేస్తోంది.
ఇదంతా బాగానే ఉన్నా టీడీపీ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల రేవంత్ రెడ్డికే ఇబ్బంది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం అయినా కూడా ఆయనకు టీడీపీ ఓటు బ్యాంక్ కూడా కలసి వస్తోంది. కాంగ్రెస్ లో కూడా టీడీపీ నేతలు పలువురు ఉన్నారు. మరి టీడీపీ ఒక్కసారి కనుక పుంజుకుంటే బలమైన పునాదులు కలిగిన ఆ పార్టీని ఎదుర్కోవడం అన్నది రేవంత్ రెడ్డికి గట్టి సవాల్ గా మారుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.