Begin typing your search above and press return to search.

వైసీపీ నేతలను తీసుకుంటారా .. బాబు వ్యూహం ఏంటి...?

వైసీపీ ఈసారి ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని చూసింది. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు

By:  Tupaki Desk   |   25 Jun 2024 3:00 AM GMT
వైసీపీ నేతలను తీసుకుంటారా .. బాబు వ్యూహం ఏంటి...?
X

వైసీపీ ఈసారి ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని చూసింది. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఒక విధంగా పీకల్లోతు కష్టాలలో కూరుకుని పోయింది. వైసీపీ నుంచి పక్క చూపులు చూస్తున్న నేతలు ఉన్నారని వారిని తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగుతోంది.

పొరుగున ఉన్న తెలంగాణాలో బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ వైపుగా నేతలు పరుగులు తీస్తున్నారు. ఏపీలో కూడా అలాగే జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రచారానికి టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేసారు.

ఎమ్మెల్యేలు పార్టీ నేతలు జిల్లా ఇంచార్జిలతో ఆయన తాజాగా నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో వైసీపీ నేతలకు టీడీపీలో నో ఎంట్రీ అని పక్కా క్లారిటీ ఇచ్చేశారు. అయిదేళ్ళ పాటు వైసీపీ నేతలు అధికారంలో ఉంటూ టీడీపీని క్యాడర్ ని ఎంతో ఇబ్బందుల పాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

అలాంటి వారు అధికారంలో ఉందని టీడీపీలోకి వస్తే తాము ఎలా చేర్చుకుంటామని ఆయన పార్టీ వారితో ప్రశ్నించారు. అలాగే పార్టీకి అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారం వచ్చిందని స్వలాభం కోసం వచ్చే వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకుని కూటమిని గెలిపించారని అటువంటి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా 31 మంది పార్టీ ఇంఛార్జ్ లకు సీట్లు రాలేదని, అయినా వారంతా త్యాగం చేసి మరీ కూటమి గెలుపే లక్ష్యంగా పని చేశారని బాబు అన్నారు. కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని బాబు హామీ ఇచ్చారు.

వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు...కష్టపడ్డ వారి వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. పార్టీ నేతలు ఇచ్చే రిపోర్టులతో పాటు .ఇతర మార్గాల్లో కూడా రిపోర్టులు తెప్పించుకుని కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చేస్తామని బాబు అన్నారు.

అంతా కలసి పార్టీని బలోపేతం చేయాలని బాబు కోరారు. ఇక తాను కూడా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్నానని ఆయన అన్నారు. రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ అనే విధంగా భవిష్యత్తులో పార్టీ నిర్ణయాలు ఉంటాయని బాబు చెప్పారు. కష్టపడిన వారందరికీ న్యాయం చేస్తామని ఆయన చెప్పారు.

అంతే కాదు 2029 ఎన్నికల్లో విజయానికి కూడా ఇప్పటి నుండే ప్రణాళిక ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయడం గమనార్హం. టీడీపీ బీసీల పార్టీ అని మరోమారు రుజువు చేశామని అన్నారు. టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పోస్ట్ బీసీలకు ఇచ్చామని అలాగే స్పీకర్ పదవిని బీసీకి ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. క్యాబినెట్ కూర్పులో కూడా సామాజిక సమతూకం పాటించామని చంద్రబాబు అన్నారు.

మొత్తం మీద చూస్తే పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇస్తాం తప్ప బయట వారికి ఇవ్వమని బాబు చెప్పేశారు. వైసీపీ నేతలను పార్టీలోకి తీసుకోమని ఆయన భరోసా ఇచ్చారు. దాంతో టీడీపీ క్యాడర్ లో హర్షం వ్యక్తం అవుతోంది.