Begin typing your search above and press return to search.

నవరత్నాలు ప్లస్ : టీడీపీ కూటమికి మాస్టర్ స్ట్రోక్ !

వారు ఒకటి అంటే మరో పార్టీ వారు కాదు నాలుగు అనడం ఆ మీదట వారు పది అంటే ఇరవై అనడం ఇలా ఉచితాలలో అనుచితాలను చూడకుండా పెంచుకుంటూ పోతున్నారు

By:  Tupaki Desk   |   27 April 2024 5:44 PM GMT
నవరత్నాలు ప్లస్ : టీడీపీ కూటమికి మాస్టర్ స్ట్రోక్ !
X

ఉచిత హామీలు అన్నవి వేలం పాట మాదిరిగా మారిపోతున్న వేళ ఇది. వారు ఒకటి అంటే మరో పార్టీ వారు కాదు నాలుగు అనడం ఆ మీదట వారు పది అంటే ఇరవై అనడం ఇలా ఉచితాలలో అనుచితాలను చూడకుండా పెంచుకుంటూ పోతున్నారు. అయితే హామీలు ఇచ్చేటపుడు వాటిని తీర్చే నిబద్ధత ఉండాలి.

అలాగే రాష్ట్ర ఖజానా పరిస్థితి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే అయిదేళ్ల పాటు తాను చెప్పిన హామీలను తుచ తప్పకుండా అమలు చేసిన ఘనతను వైఎస్ జగన్ సాధించారు. బహుశా ఇది దేశంలోనే ఎక్కడా లేని చూడని వ్యవహారంగానే భావించాలి.

ఆయన 2019లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా అమలు చేసి చూపించారు. ఎన్నికల వేళ మరిన్ని కొత్త తాయిలాలతో జగన్ ముందుకు వస్తారు అనుకుంటే ఆయన అందరికీ షాక్ ఇచ్చారు. తాను అమలు చేసుకున్న నవరత్నాల పధకాలకే ప్లస్ అని మరింత నగదును యాడ్ చేశారు తప్ప కొత్త వాటి జోలికి ఎక్కడా పోలేదు.

అంతే కాదు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అంటూ ఊదరగొడుతున్న వేళ దానికి ఏ మాత్రం టెంప్ట్ కాలేదు. నిజానికి అలా చూస్తే కనుక టీడీపీ హామీలకు రెట్టింపు జగన్ ఇవ్వాలి. అలా ఇస్తారనే ఆంతా అనుకున్నారు ఆఖరుకు టీడీపీ కూడా అనుకుంది. జగన్ మాట ఇస్తే తప్పరన్నది జనంలోనే కాదు విపక్షంలోనూ ఉన్న భావన.

అందుకే ఆయన ఏ భారీ హామీని ఇచ్చి జనాలను తిప్పుకుంటారో అని భావించింది. కానీ అసలు అలా జరగలేదు. ఆయన తాను ఏమి అనుకున్నారో అదే చెప్పారు. ఏది చేయగలను అనుకున్నారో అదే హామీగా ఇచ్చారు. అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని మోసిన ఒక ప్రభుత్వ అధినేతగా ఖజానా కష్టాలు తెలిసిన వ్యక్తిగా జగన్ ఇంత మాత్రమే చేయగలం, ఇవే కనుక హామీలుగా ఇస్తే భరించగలం అని అనుకున్నారు. అంతే కాదు ఆయన వీటిని కచ్చితంగా చేయగలమని అనుకున్నాకే ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టారు.

ఇక్కడ ఆయన నమ్మింది తనను, తనను నమ్ముకున్న ప్రజలను. అయిదేళ్ళ పాటు తాను అమలు చేసిన పధకాలను అనుభవిస్తున్న జనాలు కళ్ల ముందు ఉన్నారు. వారికి ఈ పధకాల కొనసాగింపు కావాల లేక అలవి కానీ హామీలను ఇచ్చే విపక్ష కూటమి కావాలా అని తేల్చుకోమని జనానికే పరీక్ష పెట్టారు. తాను మాత్రం సాహసంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు.

దానికి కారణం ఏంటి అంటే ఏపీలో ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం. జగన్ తానే చెప్పినట్లుగా ప్రస్తుతం ఇస్తున్న పధకాలకే డెబ్బై వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అదే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలకు కచ్చితంగా లక్షా నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అన్ని నిధులు అయితే లేవు.

మరో వైపు చూస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చని చరిత్ర బాబుకు ఉంది. అందుకే బాబుకు జనంలో విశ్వసనీయత లేదు అన్నది జగన్ ధీమా. అదే ఆయన మేమంతా సిద్ధం సభలలో పదే పదే చెబుతూ వచ్చారు. అలాగే తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అన్నది జగన్ బ్రాండ్. ఆ బ్రాండ్ పోకుండా ఉండేందుకు తన క్రెడిబిలిటీ కాపాడుకునేందుకు ఈ విధంగా చేశారు అని అంటున్నారు.

నిజానికి చూస్తే రైతు రుణ మాఫీ డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ వంటి రెండు పెద్ద హామీలు జగన్ ఇస్తారు అని చాలా కాలంగా ప్రచారం సాగింది అవి కనుక ఇచ్చి ఉంటే ఖజానాకు కొంప కొల్లేరు అయి ఉండేది అని అంటున్నారు. లక్షల కోట్లు వాటికే ఖర్చు చేయాల్సి వచ్చేది. అందుకే అన్నీ ఆలోచించే జగన్ వాటి జోలికి పోలేదు అని అంటున్నారు.

ఇక్కడ జగన్ మరో మాట చెప్పారు. తాము మెల్లగా అన్ని వర్గాలకు కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నామని అన్నారు. లేని పోనివి చెప్పడం చేయలేమని అన్నారు. అయితే జగన్ నుంచి ఈ తరహా మ్యానిఫేస్టో వస్తుందని ఊహించని టీడీపీ పెద్దలు ముందే తొందర పడి సూపర్ సిక్స్ అని ప్రకటించేసి జనంలోకి వెళ్ళిపోయారు. అవి నిజంగా గుది బండ లాంటివే అంటున్నారు.

ఇక్కడ జగన్ ది తెలివైన ఎత్తుగడ అని కూడా ఉంటున్నారు. వైసీపీని జనాలు తప్పకుండా నమ్మి గెలిపిస్తారు. ఒక వేళ కాదు అనుకున్నా చంద్రబాబు గద్దెనెక్కిన మరుక్షణం తీర్చలేని అలవి కానీ హామీలుగా అవి మిగులుతారని ఆయన నెలల వ్యవధిలోనే అన్ పాపులర్ అవుతారు అని ముందర కాళ్లకు బంధం వేసినట్లుగానే జగన్ తన మ్యనిఫేస్టోని తయారు చేసి పెట్టారు అని అంటున్నారు.

మొత్తంగా చూస్తే చాలా నీట్ గా డీసెంట్ గా జగన్ మ్యానిఫేస్టోని జనం ముందుచారు అని అంటున్నారు. దీంతో ఎవరు హామీలు అమలు చేయగలరో ఎవరు అర చేతిలో వైకుంఠం చూపిస్తారో జనాలే తేల్చుకోవాలన్నది జగన్ మార్క్ స్ట్రాటజీ. మరి జగన్ వ్యూహం తెలియక తొందరపడిన బాబు అండ్ కో సూపర్ సిక్స్ తో అడ్డంగా దొరికేసింది అని అంటున్నారు అయినా ఇక్కడితో ఆగుతారా మరింత మసాలా వండి ఇంకా కొత్త హామీలతో జనం ముందుకు వస్తారా వస్తే వాటిని జనాలు నమ్ముతారా అన్నది కూడా చూడాల్సి ఉంది.