రేవంత్ చేస్తున్నదే చంద్రబాబు చేస్తున్నారా?
ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన వైసీపీ ఫెయిల్యూర్స్ ని జనంలో పెట్టాలని చూస్తున్నారు. నిజానికి అయిదేళ్ళుగా వాటిని టీడీపీ సక్సెస్ ఫుల్ గా పెట్టింది.
By: Tupaki Desk | 21 Jun 2024 1:30 AM GMTతెలంగాణాలో ఆరు నెలల క్రితం గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చారు. తీరా అధికారం దక్కగానే ఆయన ప్రతిపక్ష బీఆర్ఎస్ మీదనే ఎక్కువ మాట్లాడుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ ఏలుబడిలో వైఫల్యాలను జనాల ముందు పెట్టేందుకే ఉత్సాహం చూపించారు. వివిధ శాఖలకు సంబంధించి శ్వేత పత్రాలను రిలీజ్ చేయడం వంటివి చేసారు. అంతే కాదు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తూ వచ్చారు.
సీన్ కట్ చేస్తే ఏపీలో చంద్రబాబు కూడా అదే దారిలో వెళ్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ హామీల విషయం పక్కన పెట్టి పోలవరం అమరావతి మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. నిజానికి అమరావతి పోలవరం చాలా ఇంపార్టెంట్.
వాటి వల్ల ఏపీకి లాభం చేకూరుతుంది. అయితే జగన్ ప్రభుత్వం అమరావతికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మూడు రాజధానులు అంటూ ముందుకు వచ్చింది. దానిని ప్రజలు మూడు చోట్లా తిరస్కరించారు. ఇక పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం తప్పు ఉంది అలాగే కేంద్రం నిధులు ఇవ్వడం లేదు ఇలా రెండు ప్రాజెక్టుల విషయం తీసుకుంటే తప్పులు చాలా జరిగాయి. వాటికి భారీ మూల్యం వైసీపీ చెల్లించుకుంది.
వైసీపీని ఘోరంగా జనాలు ఓడగొట్టారు ఇందులో ఉన్నత మధ్యతరగతి పేద వర్గాలు అంతా కలసి ఓటేత్తారు. అందుకే టీడీపీ కూటమికి భారీ మెజారిటీ దక్కింది. అయితే అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చాక పేదలు మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా సంక్షేమం గురించి చూస్తున్నారు. ఉన్నత వర్గాలు అయితే అమరావతి పోలవరం విషయం గురించి ఆలోచిస్తున్నారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన వైసీపీ ఫెయిల్యూర్స్ ని జనంలో పెట్టాలని చూస్తున్నారు. నిజానికి అయిదేళ్ళుగా వాటిని టీడీపీ సక్సెస్ ఫుల్ గా పెట్టింది. అందుకే జనాలు ఒక రేర్ రిజల్ట్ ఏపీలో కూటమికి ఇచ్చారు. అంతే కాదు చంద్రబాబు వివిధ ప్రభుత్వ శాఖల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. అది కూడా గత ప్రభుత్వం తప్పిదాల మీదనే అని చెప్పాల్సి ఉంటుంది.
సరే వైసీపీ తప్పులు ఎన్నో చేసింది అని రుజువు అవుతుంది, దాని వల్ల ఉపయోగం ఏమిటి అన్నదే చర్చగా సాగుతోంది. పోయిన ప్రభుత్వం గురించి ఎంత తిట్టినా ప్రయోజనం లేదు కదా అని అంటున్నారు. అనుభవం కలిగిన నేత అని చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. ఆయన పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదేళ్ళకు కానీ పూర్తి కాదన్నట్లుగా అధికారులు చెప్పారని అంటున్నారు. సో పోలవరం ఇప్పట్లో కాదు అన్న క్లారిటీ వస్తోంది
ఇపుడు అమరావతి విషయం తీసుకుంటే దీని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. అయితే ఈ విషయంలోనూ రిలీజ్ చేసి ఏమి సాధిస్తారు అన్నదే ప్రశ్న. కేంద్రం ఏపీకి బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తామని 2014లోనే ప్రకటించింది. అందువల్ల కేంద్రం నుంచి దండీగా నిధులు వచ్చేలా చూడాల్సి ఉంది. అలాగే పోలవరం విషయంలో జాతీయ ప్రాజెక్ట్ కనుక వారి నుంచి సవరించిన అంచనాల మేరకు నిధులు పొందాలి.
అలా ఈ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించి కనీసం కూటమి ఈ టెర్మ్ పూర్తి చేసేలోగానైనా పూర్తి చేస్తే భేష్ అని అంతా అంటారు. అయితే రాజకీయ విమర్శల వల్ల ఉపయోగం లేదు అని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా విపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు. దాని వల్ల రాజకీయంగా ఆ పార్టీలకు మేలు జరుగుతుందేమో కానీ ప్రజలకు మాత్రం కాదని అంటున్నారు. మరి ఈ విషయంలో టీడీపీ ముందు ముందు ఏమి చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం మీద కోటి ఆశలు జనాలు పెట్టుకున్నారు అన్నది పాలకులు గుర్తెరగాలి అని అంటున్నారు.