చంద్రబాబుకు అర్ధమైపోయిందా ?
ఇపుడు ప్రకటించిన జాబితాలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం దాదాపు లేదనే పార్టీవర్గాలు అంటున్నాయి.
By: Tupaki Desk | 25 Feb 2024 4:55 AM GMTతొందరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మొదటిజాబితాను విడుదలచేశారు. ప్రకటించిన 99 మంది అభ్యర్ధుల్లో టీడీపీ తరపున 94 మంది, జనేసేన తరపున ఐదుగురున్నారు. జనసేనకు చంద్రబాబు 24 అసెంబ్లీలను కేటాయించినా అందులో ఐదు నియోజకవర్గాలకు మాత్రమే పవన్ అభ్యర్ధులను ప్రకటించారు. మిగిలిన 19 నియోజకవర్గాలను, పేర్లను ప్రకటించకుండా సస్పెన్సులో ఉంచారు. చంద్రబాబు అయితే 94 నియోజకవర్గాలతో పాటు అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించేశారు. ఇపుడు ప్రకటించిన జాబితాలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం దాదాపు లేదనే పార్టీవర్గాలు అంటున్నాయి.
మొదటి జాబితా తర్వాత చూస్తే ఇక మిగిలింది 57 నియోజకవర్గాలు మాత్రమే. ఇందులో కూడా అభ్యర్ధులు ఫైనల్ అయ్యేవుంటారు. అయితే బీజేపీతో పొత్తు ఏమవుతుందో తెలీని అయోమయంలో వాటిని పెండింగులో పెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పొత్తులో బీజేపీ జాయిన్ అయ్యే విషయంలో చంద్రబాబు క్లారిటితోనే ఉన్నట్లున్నారు. పొత్తులో తమతో బీజేపీ కలిసివస్తుందన్న నమ్మకం చంద్రబాబులో లేదట. అందుకనే మొదటిజాబితా పేరుతో 94 మంది పేర్లను ప్రకటించేసింది.
పొత్తు చర్చలకు రమ్మని అమిత్ షా కబురుచేసి ఇప్పటికి 19 రోజులైనా మళ్ళీ అటువైపు నుండి ఎలాంటి కదలిక లేకపోవటమే చంద్రబాబును ఆశ్చర్యానికి గురిచేసిందట. అందుకనే బీజేపీ తమతో కలిసొస్తుందనే నమ్మకం సన్నగిల్లిందట. ఈ కారణంగానే బీజేపీని నమ్ముకుంటే కష్టమని భావించిన చంద్రబాబు సడెన్ గా మొదటిజాబితా పేరుతో హడావుడి చేశారు. ఎందుకైనా మంచిదని 57 నియోజకవర్గాలను పెండింగులో ఉంచారట. అవసరమైతే పొత్తు చర్చల్లో బీజేపీకి పెండింగులో ఉంచిన సీట్లలోనే సర్దుబాటు చేయచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా పార్టీవర్గాలు చెబుతున్నాయి.
మరికొద్దిరోజులు వెయిట్ చేసి అప్పటికి కూడా బీజేపీ వైపునుండి ఎలాంటి కదలిక లేకపోతే పెండింగులో ఉంచిన స్ధానాల్లో మరికొన్నింటిని రిలీజ్ చేయాలని చంద్రబాబు అనుకున్నారట. ఇలా ఇన్ స్టాల్ మెంట్ల పద్దతిలో 57 సీట్లలో అభ్యర్ధులను ఫైనల్ చేయబోతున్నారట. ఇదంతా దేనికంటే పొత్తులో బీజేపీ కలిసివస్తుందనే నమ్మకం లేకేనని పార్టీవర్గాల సమాచారం. ఏదేమైనా ఎన్నికల్లో పాల్గొనే విషయంలో ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి కదా.