జగన్ ముచ్చట.. చంద్రబాబుకు వరం..!
మరోసారి అదికారం ఖాయమని..అందుకే ఎన్నికలకు ముందు.. వీటిని నిర్మించుకున్నారు.
By: Tupaki Desk | 28 Jun 2024 12:30 PM GMTఏపీ తాజా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పెట్టుకున్న ఆశలు.. కొనుక్కున్న కార్లు.. కట్టుకున్న `కోటలు` ఇప్పుడు కూటమి సర్కారు పరమయ్యాయి. విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచేసి.. పర్యాటక శాఖ నిధులు 500 కోట్ల రూపాయలు వెచ్చించిమరీ.. భారీ కోటను కట్టించుకున్నారు. అదిరిపోయే హంగులు సమకూర్చుకున్నారు. ఇటాలియన్ మార్బుల్స్ సహా.. సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. ఆ ముచ్చట జగన్‌కు తీరలేదు. పైగా బాబుకు వరమైంది.
మరోసారి అదికారం ఖాయమని..అందుకే ఎన్నికలకు ముందు.. వీటిని నిర్మించుకున్నారు. ఈసారి ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే నని తేల్చి చెప్పారు. ఆయన నిజంగానే సీఎం అయి ఉంటే విశాఖలో కట్టించుకున్న కోట నుంచే పాలన సాగించి ఉండేవారు. కానీ, ప్రజాతీర్పు కారణంగా కోట ఆశలు కూలిపోయి.. అది కాస్తా.. బాబు సర్కారు పరం అయిపోయింది. దీనిని చంద్రబాబు సర్కారు రేపు వినియోగించుకోనుంది. అంటే.. జగన్ ముచ్చట చంద్రబాబుకు వరంగా మారిందన్నమాట.
ఇక, ఎన్నికలకు ముందు జగన్.. దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయించి ఆర్టీసీతో ప్రత్యేక బస్సును కొనుగోలు చేయించారు. ఇది సువిశాలమైన రైలు బోగీ అంత ఉంటుంది. పైగా.. బుల్లెట్ ప్రూఫ్‌తో పాటు.. లోపలే కాన్ఫరెన్స్ హాలు.. పడక, బాత్ రూం.. భోజనం చేసే డైనింగ్ సదుపాయం వంటివి ఉన్నాయి. ఇంత ఖరీదైన బస్సులోనే జగన్ ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. కట్ చేస్తే.. అధికారం కోల్పోయిన దరిమిలా.. ఇప్పుడు అదే బస్సు.. తాజా సీఎం చంద్రబాబుకు వరమైంది.
మరో కీలక విషయం.. జగన్ హయాంలో ప్రత్యేకంగా రూ. కోట్లు ఖర్చు చేసిన బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌ను కొనుగోలు చేశారు. వాటిలోనే ఆయన ప్రయాణించారు. అయితే.. అంత ముచ్చటపడి కొనుగోలు చేసినా.. ఆ ముచ్చట కూడా మిగల్లేదు. ఇప్పుడు సర్కారు మారడంతో.. కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్లను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు పంచేసింది. ఈ కార్లలో కొన్నింటిని పవన్ కాన్వాయ్‌గా వినియోగించనున్నారు. సో.. ఇదీ కాల మహిమ అంటే..!