చంద్రబాబు ఎక్కడకు వెళ్లారు? ఎందుకింత గుట్టు?
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కుటుంబంతో సహా అమెరికాకు వెళ్లినట్లుగా పేర్కొన్నాయి
By: Tupaki Desk | 21 May 2024 3:55 AM GMTవిదేశాలకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ తన షెడ్యూల్ గురించి ముందస్తుగా ప్రెస్ నోట్ విడుదల చేసే అలవాటు చంద్రబాబుకు ఉందని చెబుతారు. అలాంటి ఆయన తాజాగా తన ఫారిన్ టూర్ గురించి గోప్యంగా ఉంచిన వైనం ఆసక్తికరంగా మారింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కుటుంబంతో సహా అమెరికాకు వెళ్లినట్లుగా పేర్కొన్నాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం విదేశాలకు వెళ్లిన ఆయన ఫ్యామిలీ.. చంద్రబాబుకు వైద్య పరీక్షల్ని నిర్వహించేందుకు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం చంద్రబాబు అండ్ ఫ్యామిలీ అమెరికాకు వెళ్లలేదని.. వారు వెళ్లింది ఇటలీగా పేర్కొంటున్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ కు వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి ఇటలీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. తొలుత అమెరికాకు వెళ్లినట్లుగా వార్తలు రావటంతో.. టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన కోమటి జయరాంను కొన్ని మీడియా సంస్థలు సంప్రదించగా.. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అమెరికాకు రాలేదని పేర్కొన్నారు.
అనధికారికంగా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం చంద్రబాబు.. ఆయన సతీమణి.. ఆయన కుమారుడు.. కోడలు.. మనమడు కలిసి ఇటలీకి వెళ్లినట్లుగా పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. రోటీన్ గా తన ఫారిన్ ట్రిప్ గురించి ముందస్తు సమాచారం ఇచ్చే తీరుకు భిన్నంగా.. ఈసారి ట్రిప్ వివరాల్ని వెల్లడించకుండా గుట్టుగా ఉంచటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. చంద్రబాబు తన ఫారిన్ టూర్ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొద్దిపాటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబుపై సీఐడీ నాలుగు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆ విభాగానికి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళుతున్న నేపథ్యంలో.. అధికారులు అభ్యంతరం తెలిపినట్లుగా తెలుస్తోంది. దీంతో.. చంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి సీఐడీ అధికారులకు అప్పటికప్పుడు సమాచారం ఇవ్వటంతో వారి నుంచి క్లియరెన్సు రావటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను విదేశాలకు వెళ్లేందుకు వీలుగా అనుమతులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తమ ఫారిన్ ట్రిప్ లో భాగంగా ఇటలీతో పాటు.. మరికొన్ని యూరోపియన్ దేశాల్లోనూ పర్యటిస్తారని చెబుతున్నారు.