Begin typing your search above and press return to search.

వీడియో వైరల్‌.. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సంచలనం!

అయితే 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడంతో ఆయన మూడు రాజధానులను ప్రకటించారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 8:20 AM GMT
వీడియో వైరల్‌.. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సంచలనం!
X

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక రాజధాని లేకుండా పోయిన ఆంధ్రప్రదేశ్‌ కు అమరావతిని రాజధానిగా నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమరావతికి విచ్చేసి రాజధానికి శంకుస్థాపన చేశారు. దీంతో సచివాలయం, శాసనసభ, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, ఉద్యోగులు, హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలకు సంబంధించిన నిర్మాణాలను నాటి చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది.

అయితే 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడంతో ఆయన మూడు రాజధానులను ప్రకటించారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో గెలిచాక విశాఖ నుంచి పరిపాలనే సాగిస్తానన్నారు. ఈ క్రమంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి.

తాజా ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తన తొలి పర్యటనకు పోలవరం ప్రాజెక్టును ఎంచుకోగా రెండో పర్యటనకు రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం విశేషం.

ఇందులో భాగంగా చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రానున్న ఐదేళ్ల కాలంలో అమరావతి నిర్మాణ పనులను వేగవంతంగా చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేయనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత వైసీపీ ప్రభుత్వం అ«ధికారంలోకి రాగానే కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఉద్ధండరాయునిపాలెంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజధానికి ప్రధానికి శంకుస్థాపన చేసిన చోట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణామం చేశారు. మోకాళ్లను, రెండు చేతులను నేలకు ఆనించి.. శిరస్సు వంచి నమస్కారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఉద్ధండరాయుని పాలెం నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని చంద్రబాబు పరిశీలించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా పడకేసిన అమరావతి నిర్మాణాలను పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. మొదటి ఏడాదిన్నరలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కొద్ది రోజుల క్రితం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. తొలి దశలో రాజధాని నిర్మాణం, రెండో దశలో విజయవాడ నుంచి అమరావతికి మెట్రో రైల్‌ నిర్మాణం చేపడతామన్నారు.