Begin typing your search above and press return to search.

వాలంటీర్లపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు... గుర్తించారా?

గతంలో సుమారు ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వంలో ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పెన్షన్ ఇచ్చేవారు

By:  Tupaki Desk   |   1 July 2024 5:54 AM GMT
వాలంటీర్లపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు... గుర్తించారా?
X

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అసలు ఈ వ్యవస్థ ఉంటుందా.. ఉంటే అర్హతలు మారతాయా.. లేక, కొత్తవారిని రిక్రూట్ చేస్తారా మొదలైన అంశాలపై చర్చ జరుగుతుంది. పైగా... వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశం గురించి ప్రభుతం ఇంకా ఆలోచించలేదు అన్నట్లుగా మంత్రి స్పందించడంతో పాటు నేడు పెన్షన్ల పంపిణీ నుంచి వారిని తప్పించడం కూడా ఆసక్తిగా మారింది.

గతంలో సుమారు ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వంలో ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పెన్షన్ ఇచ్చేవారు. అయితే... ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమిలో వాలంటీర్ల పాత్ర కూడా ఉందన్నట్లుగా పలువురు వైసీపీ నేతలు స్పందించారు. కట్ చేస్తే... ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పెన్షన్ ఈ రోజు పంపిణీ చేస్తున్నారు.

ఈ విషయంలో వాలంటీర్లను పక్కనపెట్టిన కూటమి ప్రభుత్వం... గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం గ్రామగ్రామాన్న సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ పనుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... పెన్షన్ తో పాటు వాలంటీర్ల వ్యవస్థపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఏప్రిల్, మే నెలల్లో వాలంటీర్లతోనే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వం గతంలో ఉందని తెలిపారు.

అవును... వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వం గతంలో ఉందని.. అందువల్లే ఏప్రిల్, మే నెలల్లో 33 మంది చనిపోయే పరిస్థితి వచ్చిందని బాబు విమర్శించారు. ఆ సమయంలోనే సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పెన్షన్ పంపించమని తాము కోరామని.. అయితే వాళ్లు చేయలేదని.. ఈ నేపథ్యంలోనే సచివాలయ సిబ్బందితో అది ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకే రోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు.

ఆ విధంగా తొలిరోజే 100శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యచరణ పూర్తి చేశారని తెలిపారు. ఈ మేరకు ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పెన్షన్ దారులను కేటాయించారని.. అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్ వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారని అన్నారు. ఇదే సమయంలో... అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి తెలియజేసినట్లు చంద్రబాబు తెలిపారు. దీంతో... వాలంటీర్లను చంద్రబాబు గుర్తిస్తున్నట్లున్నారనే చర్చ మొదలైంది.