Begin typing your search above and press return to search.

జస్ట్ ఫార్టీ డేస్ అంటూ బాబు సరికొత్త వార్నింగ్ ...!

ఓడిపోతుంది అని బాబు ధీమాగా చెప్పారు. వచ్చేది ఆరు నూరు అయినా టీడీపీ జనసేన ప్రభుత్వమే అని ఆయన ఘంటాపధంగా చెప్పారు.

By:  Tupaki Desk   |   2 March 2024 12:41 PM GMT
జస్ట్ ఫార్టీ డేస్ అంటూ బాబు సరికొత్త వార్నింగ్  ...!
X

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పెద్దలకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు నుంచి కీలక వైసీపీ నేతలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వేళ చంద్రబాబు ఉత్సాహం కట్టలు తెంచుకుంది. దాంతో ఆయన జరిగిన సభలో మాట్లాడుతూ కౌంట్ డౌన్ వైసీపీ ప్రభుత్వానికి స్టార్ట్ అయింది అని జోస్యం చెప్పారు.

ఇంక ఎన్నాళ్ళు, కేవలం నలభై రోజులు మాత్రమే. ఈ ప్రభుత్వం ఉండదు, ఓడిపోతుంది అని బాబు ధీమాగా చెప్పారు. వచ్చేది ఆరు నూరు అయినా టీడీపీ జనసేన ప్రభుత్వమే అని ఆయన ఘంటాపధంగా చెప్పారు. వైసీపీ నేతలు అపుడు తాము చేసిన అరాచకాలకు ఇంతకు ఇంతా జవాబు చెప్పి తీరాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు.

వ్యవస్థలు కూడా అధికార పార్టీకి వంత పడితే వారికి తగిన తీరులో చర్యలు ఉంటాయని మరో హెచ్చరిక చేశారు. వైసీపీ వారి సిద్ధం సభలకు అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతూ అధికారులు ప్రభుత్వం పక్షాన వ్యవహరిస్తున్నారు అని బాబు మండిపడ్డారు. తాము మీటింగులు పెట్టుకుంటే ఆర్టీసీ బస్సులు ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు.

ఈ రోజు ఏమి చేసినా చెల్లుతుంది అనుకునే వారు రేపటి రోజున తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుందని బాబు అంటున్నారు. నలభై రోజుల తరువాత మొత్తం రాజకీయ సన్నివేశమే మారిపోతుందని ఆయన అంటున్నారు. ఎవరైతే అధికార పార్టీకి వత్తాసుగా ఉంటూ వస్తున్నారో వారు తప్పకుండా సంజాయిషీలు ఇవ్వాల్సిందే అని బాబు అంటున్నారు.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు మాత్రం టీడీపీ కూటమి గెలుపు మీద ధీమాగా ఉన్నారు. అంతే కాదు నలభై రోజులు మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి టైం అని చెప్పేశారు. తరువాత తామే అధికారంలోకి రాబోతున్నామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ధీమా వెనక వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత బాగా ఉందని ఒక కారణంగా ఉంది.

అదే విధంగా 2019లో ఓట్ల చీలిక వల్లనే తాము దారుణమైన ఫలితాలు చూశామని ఇపుడు పొత్తులతో వాటిని పూర్తిగా కట్టడి చేశాం కాబట్టి పూర్తి ఓటు కూటమికే దక్కుతుంది అని మరో లెక్క వేసుకున్నారు. కేంద్రంలోకి బీజేపీ కూడా కూటమితో పొత్తులకు వస్తుందని ఇంకో ధీమా ఉంది. దీని వల్ల ఎలక్షనీరింగ్ అన్నది పూర్తిగా తమకు సానుకూలం అవుతుందన్న అతి పెద్ద ఆశలు ఉన్నాయి.

ఇక జగన్ పరిపాలన వల్ల లబ్దిని పొందిన సెక్షన్లు కూడా ఓటేసేందుకు విముఖంగా ఉన్నాయని బాబు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నేపధ్యంలో ఏపీలో సైలెంట్ వేవ్ అండర్ కరెంట్ గా ఉందని బాబు లెక్క వేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన బడా నాయకులు అంతా టీడీపీలోకి రావడంతో ఆయనలో మరింత నిబ్బరం పెరుగుతోంది అని అంటునారు. మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చెబుతున్న ఫార్టీ డేస్ కౌంట్ డౌన్ పొలిటికల్ స్టోరీ అయితే టీడీపీ కూటమిలో ఆనందం నింపుతూంటే వైసీపీ పక్షాలు మాత్రం బాబుది అతి ధీమా అని కొట్టిపారేస్తున్నాయి.