Begin typing your search above and press return to search.

చంద్రబాబు మూడో శ్వేత పత్రం.. కీలక విషయాలు వెలుగులోకి!

ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   10 July 2024 10:20 AM GMT
చంద్రబాబు మూడో శ్వేత పత్రం.. కీలక విషయాలు వెలుగులోకి!
X

ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా కీలక అంశాలపై ఆయన శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతిలపైన శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు కీలకమైన విద్యుత్‌ రంగంపైన చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో కీలక అంశాలను ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటే షన్‌ ద్వారా మీడియా, రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ రంగం ఎదుర్కొన్న సంక్షోభం, వైఫల్యాలను చంద్రబాబు వివరించారు.

గత ఐదేళ్లలో విద్యుత్‌ రంగంలో జగన్‌ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అప్పులు, నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం లెక్కలు తేల్చాలంటే ఇప్పుడున్న కాగ్‌ వల్ల కూడా కాదని, కొత్త కాగ్‌ రావాల్సిందేనని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో విద్యుత్‌ రంగం సర్వనాశనమైందన్నారు. కరెంటు బకాయిల సర్దుబాటు పేరుతో పంచాయతీల నుంచి నిధులు తీసేసుకున్నారని ఆరోపించారు. ఈ మొత్తంలో కొంత మాత్రమే విద్యుత్‌ సంస్థలకు ఇచ్చారని.. మిగతా మొత్తాన్ని దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్‌ రంగంలో తానెన్నో సంస్కరణలు తెచ్చానన్నారు. వీటి వల్ల రాష్ట్రానికి మిగులు విద్యుత్‌ లభించిందన్నారు. కానీ తన ‘పవర్‌’ పోయిందని చమత్కరించారు. విద్యుత్‌ సంస్కరణలపై నాటి ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడం వల్లే అధికారాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు వైసీపీ దుర్మార్గ పాలనలో విద్యుత్‌ రంగం కునారిల్లిందని.. దీన్ని సంస్కరించే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు. మొత్తం విద్యుత్‌ రంగాన్ని గాడిన పెట్టేందుకు వ్యూహం రూపొందిస్తామని వెల్లడించారు. కోతలు, లోఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. దానిలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్రూ అప్‌ చార్జీల పేరుతో జగన్‌ ప్రభుత్వం పేదలపై భారం మోపిందని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పేదలపై ఆర్థిక భారం పడిందని.. పేదలకు నష్టం చేసి పెత్తందారులకు జగన్‌ లాభం చేశారని ఆరోపించారు.

తన ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నప్పటికీ మొత్తం వారి నెత్తినే రుద్దలేమని వ్యాఖ్యానించారు. వాళ్ల ఇబ్బందులు వాళ్లకుంటాయని.. 29 రాష్ట్రాల సమస్యలను వారు చూడాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే మన కష్టంతో ముందుకెళుతూ వారిని కూడా సాయం చేయాలని కోరానన్నారు.

గత జగన్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నింటిని సమీక్షిస్తామని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక భూతాన్ని తలుచుకుని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని.. ఆ భూతాన్ని రాజకీయంగా తాను భూస్థాపితం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైతులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్‌ ప్యానళ్లు అందజేస్తే రైతులే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారని చంద్రబాబు చెప్పారు. మిగులు విద్యుత్‌ ను వారే ప్రభుత్వానికి అమ్ముకోవచ్చన్నారు. రైతులకు దీనివల్ల ఆదాయం వస్తుందన్నారు.

రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ లో గ్రీన్‌ హైడ్రోజన్‌ విద్యుదుత్పత్తికి అపార అవకాశాలున్నాయని చంద్రబాబు తెలిపారు. ఏపీ గ్రీన్‌ హైడ్రోజన్‌ విద్యుదుత్పత్తికి హబ్‌ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పుల వల్లే విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అప్పుల్లో కూరుకుపోయాయని ఆరోపిస్తున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాకే చంద్రబాబు వదిలేసిన బకాయిలను చెల్లించి డిస్కంలను ఆదుకున్నారని గుర్తు చేస్తున్నారు.