శ్వేతపత్రాల విడుదల వెనుక బాబు ఆలోచన ఇదేనా
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పథకాలపై చర్చను సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు.
By: Tupaki Desk | 26 July 2024 3:06 PM GMTప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పథకాలపై చర్చను సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు `సూపర్ - 6` పేరుతో ఇచ్చిన పథకాలను ఆయన సభలో వివరించారు. వీటిపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని.. ఎదురు చూస్తున్నారని తెలిపారు. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. అందుకే రాష్ట్రంలో సంపద సృష్టికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అంగీకరించారు.
అయితే.. అన్నీ చేయాలని ఉన్నా.. ఇప్పటికిప్పుడు చేసేందుకు అవకాశం లేదని చంద్రబాబు చెప్పారు. అందుకే.. కొన్నాళ్లపాటు వెయిట్ చేయాలని పరోక్షంగా చెప్పారు. దీనికిసంబంధించి.. ప్రజల్లో ఎలాంటి ఆవేదన పెరగకుండా చూసే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. వారు ప్రజల్లోకి వెళ్లి.. చైతన్య పరచాలని కోరారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ఎలా దిగజారి పోయిందో వివరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎలా దోచుకున్నారో.. లెక్కలతో సహా అందుకే చెప్పామన్నారు.
ఏయే రంగాలు ఎంతగా నష్టపోయాయో కూడా.. వివరించాలని చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో నే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ బడ్జెట్ సెషన్‌లో శ్వేతపత్రాలను విడుదల చేసిందని తెలిపారు. వీటి ద్వారా.. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని పూర్తిగా వివరించామన్నారు. దీనిని ప్రజల మద్యకు తీసుకువెళ్లి వారికి వివరించి.. వారిలో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులపైనే ఉందన్నారు.
ఈ శ్వేతపత్రాలపై మీరు కూడా అధ్యయనం చేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. వీటిని ప్రజల్లోనూ చర్చకు పెట్టాలని.. రాష్ట్రాన్ని గత పాలకులు ఎలా ధ్వంసం చేశారో.. వారికి వివరించాలన్నారు. 2019లోనూ తమ ప్రభుత్వమే వచ్చి ఉంటే.. రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉండేది కాదని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వాలు మారడం తప్పుకాదని..కానీ, దుర్మార్గులు, నేరస్తుల చేతిలోకి వెళ్లకూడదనేది తన ఉద్దేశమన్నారు. తెలంగాణలో ఈ పరిస్థితి లేదన్నారు.