మైకు చూస్తే ఊగిపోయే చంద్రబాబులో ఎంత మార్పు
గడ్డు పరిస్థితుల్లో.. ఎలాంటి సమాచారం అందటం లేదన్న భావన ఉన్న వేళలో
By: Tupaki Desk | 6 Jun 2024 4:10 AM GMTమైకుతో చంద్రబాబుకున్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా టీవీ చానల్ మైక్ గొట్టం కనిపించినంతనే తనను తాను మర్చిపోతారని.. మైకు పట్టుకున్న వారికి ఓపిక ఉన్నంతవరకు మాట్లాడటం.. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం చంద్రబాబుకు అలవాటు. దశాబ్దాలుగా ఆయన్ను చూస్తున్న రిపోర్టర్లకు అలవాటు. గడ్డు పరిస్థితుల్లో.. ఎలాంటి సమాచారం అందటం లేదన్న భావన ఉన్న వేళలో.. అసలేం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవటానికి చంద్రబాబు ముందు మైకు పెడితే చాలు.. ఆయన మాటల ప్రవాహం ఒక రేంజ్ లో సాగుతుంది.
అలాంటి చంద్రబాబు జర్నలిస్టులకు దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులపై బోలెడన్నిప్రశ్నలు ఉన్నాయి. అసలేం జరుగుతుంది? కూటమి కొలువు తీరేదెన్నడు? రాష్ట్రపతిని కలిసేదెప్పుడు? మోడీ 3.0లో ఎవరెవరు ఉంటారు? దాని కాంబినేషన్ ఎలా ఉండనుంది? లోక్ సభ స్పీకర్ గా ఎవరికి అవకాశం లభించనుంది? ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు లభించనున్నాయి? వాటిల్లో కీలక శాఖలు ఎవరికి ఇవ్వనున్నారు? చంద్రబాబు వరకు వస్తే.. ఎన్ని మంత్రిపదవులు.. ఏయే శాఖల మీద ఆసక్తి ఉంది? లాంటి ప్రశ్నలు అడగాల్సినవి చాలానే ఉన్నాయి.
గతానికి భిన్నంగా చాలా తక్కువగా మాట్లాడిన చంద్రబాబు.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. చెప్పాల్సిన విషయాన్ని క్లుప్తంగా చెప్పేసిన ఆయన.. మీడియా ప్రతినిధులు అడిగే చాలా ప్రశ్నలకు గుంభనంగా ఉండిపోయారే తప్పించి ఎక్కువ సేపు మాట్లాడేందుకు ఆసక్తిని ప్రదర్శించని వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఇదంతా చూసినోళ్లు ఆశ్చర్యపోయారు. ఇదేంటి? చంద్రబాబు ఇంతలా మారిపోయారు? మైకు కనిపిస్తే కూడా రియాక్టు కాకపోవటం ఏమిటన్న సందేహాల్ని తన ఢిల్లీ పర్యటనలో మిగిల్చి తిరిగి వచ్చేశారని చెప్పాలి.