పెంచలకోనలో పూజలు పూర్తి.. చంద్రబాబు కోరికలు ఇవే!
అడవులు, కొండల మధ్య కొలువైన స్వామివారి దర్శనం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.
By: Tupaki Desk | 22 March 2024 5:12 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోన(చెంచుల కోన)ను సందర్శించా రు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో పెంచలకోన చేరుకున్న చంద్రబాబు... ఇక్కడి శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వా మిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. అడవులు, కొండల మధ్య కొలువైన స్వామివారి దర్శనం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.
ప్రజల కోసం పోరాడే శక్తిని, పనిచేసే సామర్థ్యాన్ని ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నానని చంద్రబాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, ప్రజలకు అంతా మంచి జరగాలని స్వామి వారిని ప్రార్థించానని వివరించారు. కాగా, ఈ ఆలయానికి ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో స్థిరత్వం, అధికారంలోకి రావాలని అనుకునేవారు.. గెలుపుగుర్రం ఎక్కాలని తపించే అభ్యర్థులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న చంద్రబాబు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
ఇక, చంద్రబాబు కోరికల విషయానికి వస్తే.. ఒకే ఒక్కటి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం తప్ప..ఆయనకు మరొకటి కనిపించడంలేదు. కొన్నాళ్ల కిందట ఆయన ఉండవల్లిలోని నివాసంలో ప్రత్యేకంగా పూజలు చేయించారు. యాగాలు, యజ్ఞాలు కూడా చేయించారు. కాగా.. తాజాగా పెంచల కోనలోనూ ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ వస్త్ర ధారణతో ఆలయంలోకి వెళ్లిన ఆయన.. ఎలాంటి ప్రొటోకాల్ లేకుండానే సాధారణ భక్తుడిమాదిరిగా పూజలు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను కూడా దూరం పెట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన విషయంలో టీడీపీ కూడా పలు జాగ్రత్తలు తీసుకుంది.