వైసీపీకి లైన్ క్లియర్ చేసేశారా? ఆ మాటలేవి బాబూ!
కానీ, తాజాగా ప్రకటించిన ఉమ్మడి(టీడీపీ-జనసేన) జాబితాలో ఎక్కడా వారికి చోటు దక్కలేదు
By: Tupaki Desk | 24 Feb 2024 8:57 AM GMTవైసీపీకిలైన్ క్లియర్ చేశారా? వచ్చే ఎన్నికల్లో వైసీపీని వీసమెత్తు కూడా ఛాన్స్ ఇవ్వబోమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీనిని టీడీపీ కార్యకర్తలు అందరూ నిజమే అనుకున్నారు. భారీ ఎత్తున మార్పులు, చేర్పులు ఉంటాయని కూడా ఆశించారు. దీనికి తోడు.. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జెండా మోసిన యువత కు.. ఒంగోలులో నిర్వహించిన మహానాడులో 33 శాతం సీట్లు యువతకు కేటాయిస్తామన్నారు.
కానీ, తాజాగా ప్రకటించిన ఉమ్మడి(టీడీపీ-జనసేన) జాబితాలో ఎక్కడా వారికి చోటు దక్కలేదు. పైగా.. 33 శాతం కాదు కదా.. 10 శాతం కూడా చోటు దక్కలేదు. మరీ ముఖ్యంగా యువరక్తాన్ని ఎక్కిస్తాం..కొత్తరక్తాన్ని పారిస్తామన్న మాట కూడా కనిపించడంలేదు. కొత్తవారు ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు తుని టికెట్ ఇచ్చారు. ఈ కుటుంబం వరుస పరాజయాలు చవిచూస్తోంది. అయినా.. యనమల మాటను పక్కన పెట్టలేని దైన్యం టీడీపీలో ఆవరించింది.
ఇక, పెద్దాపురం.. ఇక్కడ నుంచి మరోసారి.. నిమ్మకాయలను భుజాన ఎత్తుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే.. ఆయనను ఇక్కడ నుంచి తప్పించి ఉండేవారనే చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లోనే చావు తప్పినట్టు ఈయన గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, కడపలో మాధవి రెడ్డికి అవకాశం ఇచ్చారు. గెలుపు ఇక్కడ వన్ సైడ్ అయిపోవడం ఖాయం. ఎందుకంటే.. మైనారిటీ వర్గం మెజారిటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ వ్యూహాత్మకంగా మైనారిటీలకే ఇస్తోంది.చంద్రబాబు ఈ విషయాన్ని అందిపుచ్చుకోలేక పోయారని అనుకోవాలా?
ఇలా.. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రకటించి 94 నియోజకవర్గాల్లో 10 మందిమినహా.. అందరూ పాత కాపులే కావడంతో.. వైసీపీ చేసిన ప్రయోగానికి చంద్రబాబు విరుగుడు మంత్రం కనిపెట్టలేకపో వడంతోఅధికార పార్టీకి లైన్ క్లియర్ చేసినట్టుగా కనిపిస్తుండడం గమనార్హం. నిజానికి వైసీపీ జాబితాలు ప్రకటించినప్పుడు.. ఇంతకన్నా బలమైన నాయకులను చంద్రబాబు ఇస్తారని అందరూ అనుకున్నారు. బీసీలకు ప్రాధాన్యం పెరుగుతుందని అనుకున్నారు. కానీ, ఆ ఊసు ఇప్పటికైతే లేదు.