మళ్లీ రంగంలోకి చంద్రబాబు.. ఈ సారీ పెద్ద వ్యూహమే..!
మళ్లీ ఇప్పుడు రెండోసారి చంద్రబాబు ప్రజల మధ్యకు రానున్నారు. అదికూడా.. ఆగస్టు 1 గురువారమే కావడం గమనార్హం. అనంతపురంలో పర్యటించనున్న చంద్రబాబు ఇక్కడి ఓ గ్రామంలో పించన్లను పంపిణీ చేయనున్నారు.
By: Tupaki Desk | 31 July 2024 1:30 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఒకే ఒక్కసారి ప్రజల మధ్యకు వచ్చారు. అది జూలై 1న. అప్పట్లో పెంచిన పింఛన్లను ప్రజలకు పంపిణీ చేసేందుకు ఆయన బయటకు వచ్చారు. గుంటూరు జిల్లా అమరావతిలోని నిరుపేద కుటుంబానికి స్వయంగా వెళ్లి పింఛను ఇచ్చారు. అనంతరం.. అక్కడే టీ తాగారు. వారితో ముచ్చడించారు. ఇక, ఆ తర్వాత ఢిల్లీ పర్యటనలు.. మంత్రి వర్గ సమావేశాలు, అసెంబ్లీలో శ్వేతపత్రాలతో సరిపెట్టారు.
మళ్లీ ఇప్పుడు రెండోసారి చంద్రబాబు ప్రజల మధ్యకు రానున్నారు. అదికూడా.. ఆగస్టు 1 గురువారమే కావడం గమనార్హం. అనంతపురంలో పర్యటించనున్న చంద్రబాబు ఇక్కడి ఓ గ్రామంలో పించన్లను పంపిణీ చేయనున్నారు.గతంలో పెరిగిన పింఛనుతోపాటు.. బకాయి మూడు మాసాలకు సంబంధించి రూ.7000 చొప్పున పంపిణీ చేశారు. కానీ, ఈ సారి మాత్రం రూ.4000 చొప్పున వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇవ్వనున్నారు.
దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు తరలి రావాలని.. ఎవరి నియోజకవర్గంలో వారు పింఛన్లను పండుగ వాతావరణంంలో పంపిణీ చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి అందరూ రెడీ అయ్యారు. అయితే.. సాధారణంగా ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సారిప్రారంభిస్తారు. కానీ, అదే కార్యక్రమాన్ని చంద్రబాబు మరో సారి ప్రారంభించేందుకు రెడీ కావడం వెనుక వ్యూహం ఉందా? అంటే.. ఉందనే అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం `సూపర్ సిక్స్` పథకాలకు సంబంధించి ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. ఇది వైసీపీ ప్రోద్బలంతో జరిగింది కాదు. ప్రజల్లోనే చైతన్యం వస్తోంది. ఇటీవల అసెంబ్లీలో సాక్షాత్తూ..చంద్రబాబు సూపర్ సిక్స్‌ను చూస్తుంటే భయం వేస్తోందని చెప్పారు. తర్వాత.. ప్రజల్లో దీనిపై చర్చ ప్రారంభమైంది. అప్పులంటారు.. డబ్బులు లేవంటారు.. ఇప్పుడు భయం అంటారు.. మొత్తానికి సూపర్ సిక్స్ అమలు చేసే ఉద్దేశం ఉందా? లేదా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చర్చకు బ్రేక్ పడేలా చంద్రబాబు రెండో నెలలో కూడా.. రంగంలోకి దిగుతున్నారని.. స్వయంగా టీడీపీ నాయకులే చెబుతుండడం గమనార్హం. మరి ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా ? లేదా? అనేది చూడాలి.