"ప్రధానమంత్రితో న్యాయమూర్తులు భేటీ తప్పుకాదు.. అవసరం!"
దేశంలో న్యాయవ్యవస్థకు, పాలనా వ్యవస్థకు మధ్య సున్నితమైన రేఖలు ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 28 Oct 2024 10:30 PM GMTదేశంలో న్యాయవ్యవస్థకు, పాలనా వ్యవస్థకు మధ్య సున్నితమైన రేఖలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థకు చెందిన వారిని పాలనా వ్యవస్థలోని పెద్దలు ప్రైవేటుగా కలిసినా, పాలనా వ్యవస్థలోని పెద్దలను న్యాయమూర్తులు వంటివారు ప్రైవేటుగా కలిసినా పెద్ద చర్చే అవుతుంది. ఈ కలయికలు.. న్యాయవ్యవస్థపై ప్రభావం చూపుతాయనేచర్చ కూడా ఉంటుంది. ఇటీవల వినాయక చవితిని పురస్కరించుకుని ముంబైలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజల్లోనూ ఆయన పాల్గొన్నారు.
ఈ వ్యవహారం పెద్ద దుమారానికి దారి తీసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రస్థాయిలో తూర్పార బట్టింది. అయోధ్య రామమందిర తీర్పు సహా.. ట్రిపుల్ తలాక్ కేసుల తీర్పులో న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యాన్ని పేర్కొంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ విషయంపై జస్టిస్ చంద్రచూడ్ పరోక్షంగా స్పందించారు. న్యాయమూర్తులు-అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు మధ్య సత్సంబంధాలు ఉండడం తప్పులేదని, ఆ సంబంధాలు అవసరమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
హైకోర్టులలోని ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు.. తరచుగా ముఖ్యమంత్రిని కలుసుకోవడం అనేది సంప్రదాయంగా వస్తున్నదేనని చెప్పారు. అదేవిధంగా ప్రధానిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా కలుసుకోవాలని..ఇది అవసరమని వ్యాఖ్యానించారు. ఇలా తరచుగా కలిస్తే.. కోర్టులకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ``మాకు కొత్తగా కోర్టులు అవసరం. దీనిని న్యాయస్థానాల్లో ఉండి ఆదేశించలేం. తరచుగా కలుసుకున్నప్పుడు ఇలాంటి ప్రతిపాదనలు చేసేందుకు అవకాశం ఉంటుంది. వాళ్లు(ముఖ్యమంత్రులు, ప్రధాని)కూడా తమ ఇబ్బందులు చెప్పేందుకు అవకాశం ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది ఇలాంటి సమావేశాలు అవసరం`` అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. న్యాయవ్యవస్థకు చెందిన వారు.. రాజకీయ నేతలతో భేటీ అయినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని అనుకోవడం పొరపాటని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ``ఆగస్టు 15, జనవరి 26 వంటి జాతీయ పండుగల సమయంలోనే కాదు.. తరచుగా కలుసుకుంటే.. ఏదో జరిగిపోతుందని, రాజకీయాలు మాట్లాడతారని అనుకుంటారు. కానీ, అలా ఏమీ జరగదు. మన దేశ రాజకీయ వ్యవస్థ చాలా పరిణితి చెందింది. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో రాజకీయ నేతలకు తెలుసునని.. వారంతా నిర్మాణాత్మకంగా ఉంటారు. న్యాయమూర్తులు కూడా ఎక్కడా పరిధి దాటరు`` అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.