Begin typing your search above and press return to search.

సంపద సృష్టిస్తున్న బాబు... నేర్చుకోవాల్సిందే !

సంపద అంటే ఏమిటి చేతిలో డబ్బు ఆడడం. అంతే కాదు ఉన్న రూపాయి ఖర్చు కాకుండా జాగ్రత్త చేయడం.

By:  Tupaki Desk   |   21 Aug 2024 3:55 AM GMT
సంపద సృష్టిస్తున్న బాబు... నేర్చుకోవాల్సిందే !
X

సంపద అంటే ఏమిటి చేతిలో డబ్బు ఆడడం. అంతే కాదు ఉన్న రూపాయి ఖర్చు కాకుండా జాగ్రత్త చేయడం. ఇలా రెండిందాలుగా సంపద సృష్టి జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు సభల్లో మాట్లాడుతూ తాను సంపద సృష్టించి అభివృద్ధి సంక్షేమం రెండూ అందిస్తాను అని చెప్పేవారు. దానిని ఆనాటి అధికార వైసీపీ నేతలు ఎద్దేవా చేసేవారు.

ఇపుడు కూడా అంటున్నారు. అధికారంలోకి వచ్చిన బాబు సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు అని నిలదీస్తున్నారు. బాబు కొత్త రూపాయిని సృష్టించేందుకు ప్రయత్నాలు అయితే మొదలెట్టారు. ఫలితాలు రావడానికి చాలా టైం పడుతుంది. అయితే అదే సమయంలో బాబు రెండో మార్గాన ఉన్న రూపాయి జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో సంక్షేమం అభివృద్ధి విషయాల్లో ప్రయారిటీ ప్రాతిపదికన డెసిషన్స్ తీసుకుంటున్నారు.

ఏపీలో అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ఇటీవల ప్రారంభించారు. వాటిని వంద దాకా ఓపెన్ చేశారు. మరో వంద కూడా రానున్న రోజులలో స్టార్ట్ చేస్తారు. దీనికి ఏటా అయ్యే ఖర్చు 250 కోట్ల రూపాయలు అయితే ఇక్కడే బాబు తెలివిగా ఆలోచిస్తున్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ భారం ప్రభుత్వం మీద పడకుండా శాశ్వతంగా అవి తమ మానాన నడిచేలా ఆయన ధనవంతులను పిలిచి మరీ విరాళాలను సేకరిస్తున్నారు.

ఈ విధంగా పెద్ద ఎత్తున విరాళాలు సమకూరితే దాంతో కార్పస్ ఫండ్ ని ఏర్పాటు చేస్తే అన్న క్యాంటీన్లు దివ్యంగా కొనసాగుతాయి. సర్కార్ కి మంచి పేరు వస్తుంది. పేదలకు పట్టెడు అన్నం దొరుకుంతుంది అన్నది బాబు మార్క్ ప్లాన్. ఒక అన్న క్యాంటీన్ కి ఒక రోజుకు పాతిక నుంచి ముప్పయి వేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నది లెక్క. ఈ విధంగా రెండు వందల అన్న క్యాంటీన్లకు ఒక రోజుకు అయ్యే ఖర్చు 50 లక్షల దాకా అవుతుంది.

ఇలా లెక్క వేసుకుంటే నెలకు పదిహేను కోట్లు ఏడాదికి 200 కోట్లు గా లెక్క. అయితే ఈ మొత్తాన్ని పూలప్ చేయడం ద్వారా కార్పస్ ఫండ్ ని సృష్టిస్తే ఆ వడ్డీతో ఈ క్యాంటీన్లను నడపవచ్చు అన్నది ఒక లెక్క. అందుకోసమే బాబు కార్పోరేట్ శక్తులను పెద్దలను విరాళాల కోసం పిలుస్తున్నారు. అంతా వచ్చి తలా కాస్తా సాయం చేస్తే మొత్తం ఖర్చు పోతుంది. లేకపోయినా సర్కార్ కి సగానికి సగం ఖర్చు తగ్గుతుంది.

అంటే ఒక సంక్షేమ పధకం అద్భుతంగా నడుపుతూ సర్కార్ పెద్దగా భారం పెట్టుకోకుండా ఎలా చేయాలో బాబు చూపిస్తున్నారు అన్న మాట. మరి ఇది సంపద సృష్టి కాదా అని టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే ఏపీలోని రోడ్లను అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వానికి ఏకంగా ఎనిమిది నుంచి పది వేల కోట్లు ఖర్చు అవుతాయి. దాంతో పీపీపీ ఫోర్ అన్న విధానంలో బాబు వీటిని అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు.

దాని వల్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది. వాటిని నిర్మించిన సంస్థలు టోల్ గేట్ పెట్టినా అవి టూ వీలర్ త్రీ వీలర్స్ కి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం చూస్తుందని అంటున్నారు. ఇది అభివృద్ధికి బాబు వేసిన ఒక గొప్ప ఆలోచన అని అంటున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులను కార్పోరేట్ ఆసుపత్రులకు అటాచ్ చేయడం ద్వారా అక్కడ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

దీనికి నాందిగా చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో ఆసుపత్రికి ఇస్తున్నారు అని అంటున్నారు. అలాగే మెడికల్ కాలేజీలను కూడా నిర్వహణ కోసం ప్రైవేట్ వారికి ఇస్తున్నారు అని అంటున్నారు. ఇలా ఖజానాకు భారం కాకుండా అదే సమయంలో పేదలకు సేవలు పోకుండా వయా మీడియాగా బాబు తీసుకుంటున్న ఈ చర్యలనే సంపద సృష్టి అంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

జగన్ సీఎం గా ఉన్నపుడు ప్రతీ దానికీ అప్పులు చేసేవారు. అవి తడిసి మోపెడు అయ్యాయని అంటున్నారు. దానికి బదులుగా బాబు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ని ప్రోత్సహిస్తున్నారని దీని వల్ల అప్పుల బెడద నుంచి తప్పించుకోవచ్చు అని అంటున్నారు. అప్పు చేయకపోవడమే సంపద అన్నది కూడా బాబు మార్క్ థియరీ అని అంటున్నారు. -

ఇక రానున్న రోజులలో ఎటూ పరిశ్రమలు వస్తాయి కాబట్టి వాటి వల్ల వచ్చే పన్నుల ఆదాయం తో కొత్త రూపాయి ఖజానాకు చేరుతుందని ఇదంతా అయిదేళ్ల కాలంలోనే జరుగుతుంది అని అంటున్నారు. మొత్తానికి ఒక ప్రభుత్వం ఒక మంచి పధకం కోసం సమాజంలోని వారిని కలుపుని పోతే ఖజానా భారం తగ్గుతుంది. ఈ విధానాలను జగన్ కూడా నాడు చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు