చంద్రమోహన్ తెరంగేట్రానికి ఆయనే బీజం!
చంద్రమోహన్ గొప్ప నటుడైతే..ఆయన భార్య జలంధర ప్రముఖ రచయిత్రి.
By: Tupaki Desk | 11 Nov 2023 7:23 AM GMTచంద్రమోహన్ గొప్ప నటుడైతే..ఆయన భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. దాదాపు 100కి పైగా కథలు. పలు నవళ్లు రాసారు ఆమె. సాహిత్య పురస్కారాలు జలంధర అందుకున్నారు. వివాహం తర్వాత కూడా ఇద్దరు ప్రయాణాలు ఎంతో సాఫీగా సాగాయి. రంగాలు వేరైనా...ఒకే తాటికిందకి వచ్చేవి కావడంతో ఏనాడు ఎలాంటి మనస్పర్దలు చోటు చేసుకోలేదు. ఆలుమగల జీవితం ఎంతో సంతోషంగా సాగిపోయింది.
ఆదర్శ దంపతులుగా జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. జలంధర బీఏ ఎకనామిక్స్ చేసారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. మధుర మీనాక్షి..మాధవి అనే కుమార్తెలు గలరు. సాహిత్య..నటనా రంగంలో భార్య భర్తలు ఉన్నా పిల్లల్ని మాత్రం సినిమా రంగం వైపు తీసుకురాలేదు. సినిమా అనేది తనతో పాటు ముగిసిపోవాలని చంద్రమోహన్ అనేవారు. పిల్లల్ని తీసుకురావడం ఇష్టం లేదని ఓ సందర్భంలో అనేవారు.
దీంతో ఉన్నత చదువులు తర్వాత పిల్లలు ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మీనాక్షి అమెరికాలో సైకాలజిస్ట్ కాగా.. మాధవి చెన్నైలో డాక్టర్ వృత్తిలో ఉన్నారు. అలాగే కళాతపస్వి కె. విశ్వనాధ్ చంద్రమో హన్ కి దగ్గర బంధువు అవుతారు. చంద్రమోహన్ సినిమాల్లోకి రావడానికి కారణం కూడా ఆయనే. ఆ తర్వాత ఆయన ఎదుగుదలలో విశ్వనాధ్ ఉన్నారు. ఆయన సినిమాలతోనే చంద్రమోహన్ కి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది.
ఈ విషయం చాలా సందర్భాల్లో చంద్రమోహన్ గుర్తు చేసారు. చెన్నైలో ఉన్నంత కాలం ఇద్దరి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉండేవి. అలాగే ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తోన్న శివలంక కృష్ణ ప్రసాద్ ..చంద్రమోహన్ కి మేనల్లుడు అవుతారు. ఆయన నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ తొలి సినిమా `చిన్నోడు పెద్దొడ్డు`. ఇందులో రాజేంద్ర ప్రసాద్..చంద్రమోహన్..ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు.