తెలుగు పాలిటిక్స్ 2024 : ఎకాఎకీన కేంద్రమంత్రి అయిన ఎన్నారై !
రాజకీయాల్లో అన్నీ చూస్తారు. ఇక్కడ సెంటిమెంట్లు లేని వారు ఉండరు. అంతా కాలాన్ని నమ్ముతారు.
By: Tupaki Desk | 20 Dec 2024 7:30 AM GMTరాజకీయాల్లో అన్నీ చూస్తారు. ఇక్కడ సెంటిమెంట్లు లేని వారు ఉండరు. అంతా కాలాన్ని నమ్ముతారు. కేవలం పన్నెండు నెలలతో కూడిన క్యాలెండర్ అని గోడకు తగిలించిన కాగితాల గుట్ట అని ఎవరూ అనుకోరు. ఆ అంకెలు లెక్క తేలుస్తాయి. ఆ గోడకు తగిలించి పదిలపరచిన క్యాలెండర్ జాతకాలను మారుస్తుంది.
అందుకే ప్రతీ కొత్త ఏడాదికి జనాలు ఎపుడూ ఘనంగా స్వాగతం పలుకుతారు. తమ ఆశలను అలా గుట్టలుగా పోసి మంచి చేయాలని వేడుకుంటారు. వారూ వీరూ అన్న తేడా లేదు, డబ్బు దర్పం అన్న ప్రశ్నే లేదు. మరి ఆ విధంగా చూస్తే రాజకీయ జీవులకు ఉన్న ఆశలను 2024 ఎంతమేరకు నెరవేర్చింది అన్నది చూస్తే కనుక తెలుగు నాట చాలా మందికి 2024 తనదైన జాతకాన్ని విప్పి చెప్పింది.
కొందరికి అధికార సోపానాలు అందించింది. మరి కొందరికి ఆశలను అలా సజీవంగా ఉంచేసుకోమంది. మరి కొందరికి అనూహ్యంగా ఇంటి తలుపు తట్టి వారు కలలో సైతం ఊహించని అందలాన్ని అందించింది. ఆ కోవలోకి వచ్చిన వారే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన ఎన్నారై. ఉన్నత విద్యాభ్యాసంతో ఆయన అమెరిలాలో సెటిల్ అయి అక్కడే తన ఉన్నతిని సాధించారు. ఒక డాక్టర్ గా మారి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.
ఇక తాను పుట్టిన ప్రాంతానికి సేవ చేయడానికి ఆయన చొరవ చూపిస్తూ వచ్చారు. ఆయన 2014, 2019లలో నరసారావుపేట ఎంపీ టికెట్ ని ఆశించారు కానీ దక్కలేదు. కానీ అనూహ్యంగా 2024లో ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ని టీడీపీ అధినాయకత్వం ఇచ్చింది.
ఆ సీటుకు సిట్టింగ్ ఎంపీ అయిన గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి స్వచ్చందంగా విరమించుకోవడంతో పెమ్మసానికి ఈ లక్కీ చాన్స్ దక్కింది. ఇక టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో కేంద్ర మంత్రి వర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చాన్స్ అలా లభించింది.
అయితే టీడీపీ తరఫున పదహారు మంది ఎంపీలు గెలిస్తే అందులో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ కి కేంద్ర మంత్రి పదవి లభించడం నిజంగా పొలిటికల్ లక్ అనే చెప్పాలంటున్నారు. రామ్మోహన్ అయితే మూడు సార్లు ఎంపీగా ఉంటూ వచ్చారు.
పెమ్మసాని అలా కాదు మొదటిసారి ఎంపీ అయిన వారు. టీడీపీలో చూస్తే ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. అయినా సరే ఆయన పేరుని అధినాయకత్వం పరిగణనలోకి తీసుకుని కేంద్ర మంత్రిగా మోడీ కేబినెట్ లోకి పంపించింది అంటే అది అనూహ్యమైనది అనే అంటున్నారు.
ఆయనకు ఎంపీ సీటు ఊహాతీతంగా ఎలా దక్కిందో దానికి మించి కేంద్ర మంత్రి పదవి కూడా అదే తీరున దక్కింది అని అంటున్నారు. అంతే కాదు కీలకమైన కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా అవకాశం లభించింది. దీంతో ఎన్నారైగా ఉంటూ వచ్చిన పెమ్మసానికి ఇది అరుదైన అదృష్టంగా అంతా అంటున్నారు. ఆయనకు 2024 క్యాలడర్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ గా చెబుతున్నారు.
రాజకీయాల్లో దశాబ్దాల పాటు ఉన్నా ఎంపీ ఎమ్మెల్యే టికెట్ దక్కడమే గగన కుసుమం. అలాంటిది ఒకే దఫాలో ఎంపీ, కేంద్ర మంత్రి అంటే పెమ్మసానిని 2024 ఎంతలా గ్రీట్ చేసింది అన్నదే చర్చగా ఉంది. తెలుగు నాట మరీ ముఖ్యంగా ఏపీలో పెమ్మసాని పొలిటికల్ హవాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బ్రేకులు లేకుండా దూసుకుపొమ్మని ఆశీర్వదించిన ఇయర్ గా 2024ని ఆయన అభిమానులూ అనుచరులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అని అంటున్నారు.