Begin typing your search above and press return to search.

చంచలగూడ జైలు వద్ద బన్నీ మామ రచ్చ

తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన సందర్భంగా చోటు చేసున్న పరిణామాలు అన్ని ఇన్ని కావు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 11:30 PM GMT
చంచలగూడ జైలు వద్ద బన్నీ మామ రచ్చ
X

తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన సందర్భంగా చోటు చేసున్న పరిణామాలు అన్ని ఇన్ని కావు. అతడి అరెస్టు.. జైలు తరలింపుపై పలువురు కేంద్ర మంత్రులతో పాటు.. వివిధ రాజకీయ నేతలు రియాక్టు అయ్యారు. పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన తర్వాత.. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ రావటంతో ఆయన విడుదల జైలుకు వెళ్లిన కొన్ని గంటల్లోనే జరుగుతుందని భావించారు.

దీనికి తగ్గట్లే అల్లు అర్జున్ తండ్రి కం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. బన్నీ మామ కం కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డిలు చంచలగూడ జైలుకు వచ్చారు. తొలుత ఉన్న అంచనాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల వేళకు అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చేస్తారని భావించారు. కానీ.. బాండ్ పేపర్లు జైలు అధికారులకు సమర్పించినప్పటికీ.. హైకోర్టు బెయిల్ ఉత్తర్వు ఆన్ లైన్ లో అప్ లోడ్ దగ్గర నుంచి మరికొన్ని సాంకేతిక అంశాల నేపథ్యంలో శుక్రవారం విడుదల కాని పరిస్థితి.

అదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ మీద వచ్చేస్తారన్న ఉద్దేశంతో అల్లు అరవింద్.. బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డిలు జైలు వరకు వచ్చారు. అయితే.. విడుదల ప్రాసెస్ ఆలస్యం అవుతుందన్న విషయం టైం గడిచే కొద్దీ అర్థమైంది. దీనిపై చంద్రశేఖర్ రెడ్డి ఎస్కార్టు సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో.. ఆయన్ను డబీర్ పుర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే సమయంలో కొడుకును వెంటపెట్టుకొని తీసుకెళ్లేందుకు వచ్చిన అల్లు అరవింద్.. బన్నీ విడుదల శనివారం ఉదయానికి మాత్రమే అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకొని విసుగు చెందారు. చివరకు తన కారును జైలు వద్దే వదిలేసిన ఆయన.. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఆయన ఫోన్ చేస్తే నిమిషాల్లో మరో కారు వచ్చే వీలున్నా.. అదేమీ చేయకుండా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లటం ఆసక్తికరంగా మారింది.