Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ మామ ఏమంటున్నాడో తెలుసా ?

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నంధ్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం మీద ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించాడు.

By:  Tupaki Desk   |   12 May 2024 8:52 AM GMT
అల్లు అర్జున్ మామ ఏమంటున్నాడో తెలుసా ?
X

ఏపీ ఎన్నికలలో ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ నిన్న వైసీపీ నంధ్యాల అభ్యర్థి శిల్పా రవించంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వెళ్లిన విషయం తెలిసిందే. తన మామ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్లకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి వద్దకు వెళ్లడం చర్చానీయాంశంగా మారింది. ఒకవైపు మెగా కుటుంబం పవన్ కు మద్దతుగా పిఠాపురం బాటపట్టగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నంధ్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం మీద ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించాడు. "అల్లు అర్జున్ ఆయన స్నేహితుడి కోసమే ప్రచారం చేస్తున్నాడు. తప్ప ఆయన అర్జున్ ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడం లేదు. స్నేహితుడిని గెలిపించాలనే ఆయన ప్రచారం చేస్తున్నాడు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ లతో పాటు మెగస్టార్ చిరంజీవి అందరూ కుటుంబ సభ్యులే. వారిలో ఒక్కొక్కరూ ఒక్కో పార్టీకి ప్రచారం చేయడం పూర్తిగా వారి వ్యక్తిగతం" అని అన్నారు.

దేశ ప్రజలు మద్దతు ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఉందని, మల్కాజ్ గిరిలో గెలుపు తమదేనని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నానని, దేశాన్ని, దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలను ఒక్కటి చేసే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, బీజేపీ మతతత్వ పార్టీ అని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, రాహుల్ గాంధీ ప్రధాని పదవి కావడం తథ్యం అని జోస్యం చెప్పాడు. శాసనసభ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందులో చేరాడు.