రాముడు నా కలలోకి వచ్చాడు.. ఆ విషయంపై చాలా బాధపడ్డాడు
ఎవరీ మంత్రి.. ఏం జరిగింది? 58 ఏళ్ల చంద్రశేఖర్ బిహార్ విద్యా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 19 Sep 2023 5:35 AM GMTరాజకీయాల్లో ఉన్నవారు చేసే వ్యాఖ్యలు ఆసక్తిగా ఉంటాయి. ప్రత్యర్థులపై వారు వేసే సటైర్లు మరింత ఇంట్రస్టింగ్‌గా కూడా ఉంటాయి. అయితే.. వీటికి భిన్నంగా బిహార్ మంత్రి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాముడు తన కలలో కనిపించాడని.. తనను ఒక విషయంపై అభ్యర్థించాడని.. దానిని నెరవేర్చాల్సిన అవసరం తనపై ఉందని మంత్రి వర్యులు కామెంట్ చేశారు. ప్రస్తుతం బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎవరీ మంత్రి.. ఏం జరిగింది? 58 ఏళ్ల చంద్రశేఖర్ బిహార్ విద్యా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈయన రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. పన్నెత్తి ఎవరినీ పరుషంగా విమర్శించరనే పేరు కూడా ఉంది. అయితే.. తాజాగా ఆయన చిత్రమైన వ్యాఖ్యలతో మీడియాలో నిలిచారు. తన కలలో శ్రీరామచంద్రుడు కనిపించాడని చెప్పుకొచ్చారు. విరాట్ స్వరూపాన్ని చూసి.. తాను మంత్ర ముగ్ధుడిని అయినట్టు చెప్పారు.
అంతేకాదు.. ఈ సందర్భంగా తనను రాముడు ఓ విషయంపై అభ్యర్థించాడని చెప్పారు. బహిరంగ మార్కెట్లో తనను విక్రయించకుండా చూడమని రాముడు కోరినట్లు చెప్పారు. ''రాముడు నా కలలోకి వచ్చాడు. ప్రజలు తనను మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పాడు. అలా జరగకుండా నన్ను రక్షించమని కోరాడు'' అన్నారు. అంతేకాదు.. కుల వ్యవస్థ, మత విశ్వాసాలు, చారిత్రక వ్యక్తుల గురించి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
''రాముడు సైతం శబరి ఎంగిలి చేసిన ఆహారాన్ని తిన్నాడు. కానీ, నేటికీ శబరి కుమారుడికి ఆలయ ప్రవేశం నిషిద్ధమే. ఇది విచారకరం. రాష్ట్రపతి, ముఖ్యమంత్రిని కూడా దేవాలయాలను సందర్శించకుండా అడ్డుకున్నారు. ఆలయాలను గంగాజలంతో శుద్ధి చేశారు. దేవుడే శబరి ఇచ్చిన ఆహారం తిన్నాడు. కుల వ్యవస్థ పట్ల ఆయన కూడా అసంతృప్తి చెందాడు'’ అని మంత్రి వ్యాఖ్యానించారు.