చంద్రయాన్-3: అరుదైన రికార్డుకు మరో అడుగు దూరంలో!
చందమామ రహస్యాలను చేధించడానికి భారత్ ప్రయోగించిన చంద్రయాన్ - 3 పైనే అందరి దృష్టి నిలిచింది
By: Tupaki Desk | 23 Aug 2023 9:29 AM GMTచందమామ రహస్యాలను చేధించడానికి భారత్ ప్రయోగించిన చంద్రయాన్ - 3 పైనే అందరి దృష్టి నిలిచింది. అందులోనూ ఇప్పటివరకు ఏ దేశం సాహసించని ప్రయోగానికి భారత్ పూనుకుంది. అదే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను దించడం. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మూడు దేశాలే చంద్రుడి పైన ల్యాండర్ ను దించగలిగాయి. అయితే వీటిలో ఏ ఒక్కటి చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను దించలేకపోయాయి. తాజాగా దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా చేసిన ప్రయోగం విఫలమైంది. దీంతో ప్రపంచంలో అన్ని దేశాల కళ్లు భారత్ వైపు చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్ని ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చేరుకోనుంది. అంతా అనుకున్నట్టు జరిగితే చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ అడుగు పెట్టనుంది. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ల్యాండర్ దించడానికి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
చంద్రుడిపై ల్యాండర్ దించే ప్రక్రియను మొత్తం ఇస్రో లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అపూర్వ ఘట్టాన్ని బుధవారం సాయంత్రం 5.20 నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ల్యాండర్ మాడ్యూల్ చందమామను చేరుకొనే అద్భుత క్షణాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 'జయహో భారత్.. జయహో ఇస్రో', 'జైహింద్' నినాదాలతో యువత సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
కాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జూలై 14న చంద్రయాన్-3 మిషన్ ను ప్రయోగించింది. ఈ క్రమంలో 41 రోజుల ప్రయాణంలో ఐదుసార్లు భూమధ్యంతర కక్ష్యలో, మరో ఐదుసార్లు లూనార్ ఆర్బిట్(చంద్రుడి కక్ష్య)లో చంద్రయాన్-3 మిషన్ కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు పెంచుతూ వచ్చారు. చంద్రయాన్-3లో భాగంగా ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి దగ్గరగా విజయవంతంగా వదిలిపెట్టింది. ఇక ఇప్పుడు మిగిలింది ఉపరితలంపై క్షేమంగా ల్యాండర్ ను దించడమే.
ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం నుంచి 25x134 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తున్న ల్యాండర్ మాడ్యూల్‌ను సెకన్‌కు 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి బుధవారం సాయంత్రం 6.04 గంటలకు సురక్షితంగా చంద్రుడి దక్షిణ ధ్రువంలో దించనున్నారు. ఇందులో ఆఖరి 17 నిమిషాలు అత్యంత కీలకం. దీన్ని '17 మినిట్స్ ఆఫ్ టెర్రర్' అని అభివర్ణిస్తున్నారంటే ఇదెంత ముఖ్యమో తెలుస్తోంది. ఈ 17 నిమిషాల్లోనే ల్యాండర్ తనలోని ఇంజిన్లను తానే మండించుకుంటుంది.
ఈ క్రమంలో సరైన సమయంలో ఇంజిన్లను మండించడం, సరైన పరిమాణంలో ఇంధనాన్ని వాడుకోవడం చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాండర్ మాడ్యూల్‌లో నాలుగు థ్రస్టర్ ఇంజిన్లు ఉన్నాయి. ల్యాండర్.. చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వీటిని మండించడం ప్రారంభమవుతుంది. దాంతో ల్యాండర్ వేగం క్రమంగా తగ్గిపోతుంది. తనలోని సైంటిఫిక్ పరికరాలతో ల్యాండింగ్ సైట్‌ను ల్యాండర్ మాడ్యూల్ తెలుసుకుంటుంది. ఈ క్రమంలో అడ్డంకులు ఏవైనా ఉంటే గుర్తిస్తుంది. ల్యాండింగ్ అయ్యే ప్రాంతం చదునుగా ఉంటే బుధవారం ల్యాండింగ్ అవుతుంది. లేదంటే మరికొద్ది రోజులకు వాయిదా పడే అవకాశం ఉంది. వాయిదా పడితే ఈ నెల 27న సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామని ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటించారు
ఈ నేపథ్యంలో ల్యాండర్ మాడ్యూల్‌ను నిరంతరం క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం చక్కగా పనిచేస్తోందని ఇస్రో వెల్లడించింది. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు అవసరమైన కమాండ్‌లను ల్యాండర్‌లో ఇస్రో అప్‌లోడ్ చేస్తుంది.
కాగా జాబిల్లిపై ప్రయోగాలకు ఇస్రో మొదటగా అనుకున్న పేరు 'చంద్రయాన్' కాదు. సోమయాన్ అని పేరు పెట్టాలనుకున్నారు. అయితే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సూచన మేరకు ఈ పేరును మార్చారు. ఈ మేరకు ఇస్రో మాజీ ఛైర్‌పర్సన్ డా. కె. కస్తూరిరంగన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.