ఇది చదివితే చంద్రుడి మీద ల్యాండింగ్ ఎంత సవాలో అర్థమవుతుంది!
ఇక్కడో ఉదాహరణతో.. తాజా విజయం ఎంత క్లిష్టమైందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఉదాహరణతో ఇట్టే అర్థమవుతుంది
By: Tupaki Desk | 24 Aug 2023 5:20 AM GMTఅంచనాలకు తగ్గట్లే ఇస్రో తన సత్తా చాటింది. చంద్రయాన్ 3 సక్సెస్ తో.. నాలుగేళ్ల ముందు చంద్రయాన్ 2 వైఫల్య విషాదాన్ని అధిగమించేలా చేయటమే కాదు.. అద్భుతాన్ని సాధించే ముందు కొన్ని సవాళ్లు ఖాయమన్న కఠిన నిజాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. లైవ్ లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ భాగాన సేఫ్ ల్యాండ్ అయిన సీన్లను ప్రత్యక్ష ప్రసారంలోచూసినప్పుడు.. మామూలుగా ల్యాండ్ అయినట్లు కనిపిస్తుంది. కానీ.. సగటుజీవికి అర్థం కాని కొన్ని అంశాల్ని తాజా విజయానందవేళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు ఇప్పటివరకు ఎవరూ వెళ్లింది లేదు. ఈ ప్రాంతంలో ఏం ఉంది? అక్కడేం జరుగుతోంది. అక్కడి పరిస్థితులు ఏమిటన్న విషయాన్ని ఇప్పటివరకు ప్రపంచానికి తెలీదు. ఇలాంటి చోట ఒక భారీ కారు (సుమారు 1700 కేజీలు)తో సమానమైన బరువున్న ల్యాండర్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మూత్ గా ల్యాండ్ కావటం ప్రయోగంలో అత్యంత కీలకమైన అంశం.
ఇక్కడో ఉదాహరణతో.. తాజా విజయం ఎంత క్లిష్టమైందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఉదాహరణతో ఇట్టే అర్థమవుతుంది. మనలో చాలామంది విమాన ప్రయాణం చేసి ఉంటారు. అందులో టేకాఫ్ సంగతి పక్కన పెడితే.. విమానం ఎయిర్ పోర్టు రన్ వే మీద దిగే సమయంలో విమాన కుదుపులకు లోను కావటం అందరికి అనుభవమే.
అయితే.. ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయ్యే రన్ వే గట్టిగా ఉండటంతో పాటు విమానాన్ని నడిపే పైలెట్ ప్రత్యక్షంగా చూస్తూ.. ల్యాండింగ్ ప్రకియను సజావుగా పూర్తి చేయటం ఒక ఎత్తు అయితే.. లక్షలకిలోమీటర్ల దూరంలో ఒక ఎస్ యూవీ కారు బరువున్న ల్యాండర్ ను ఎలాంటి కుదుపులకు లోను కాకుండా.. పరిమితమైన వేగంతో.. ఎత్తుపల్లాలు.. చుట్టూ గుంతలు ఉన్న చోట దించటం అంత సాధ్యమయ్యేది కాదు.
ల్యాండింగ్ వేళ వేగంలో ఏ మాత్రం తేడా కొట్టినా.. ల్యాండర్ కాళ్లకు దెబ్బ తాకే అవకాశం ఉంది. అదే జరిగితే.. మొత్తం ప్రయోగం ఫెయిల్ అయినట్లే. ఈ సంక్లిష్టమైన ల్యాండింగ్ ప్రక్రియను చంద్రుడి నుంచి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరులోని ఇస్రో సెంటర్ నుంచి కంట్రోల్ చేస్తూ.. స్మూత్ ల్యాండ్ చేయటం మామూలు విషయం కాదు. ఫ్లైట్ ను పైలెట్ ప్రత్యక్షంగా చూస్తూ చాకచక్యంగా ల్యాండ్ చేయటం కాకుండా.. సెన్సర్లు.. ప్రీ ప్రోగ్రామింగ్ సూచనలతో పరోక్షంగా అంటే రిమోట్ నుంచి ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది.
దీనికి తోడు చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి సంబంధించిన అంచనా ఏ మాత్రం తేడా ఉననా.. ఉపరితలంపై ల్యాండర్ పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ కఠిన సవాళ్లను దాటుకుంటూ సైంటిస్టులు విక్రమ్ ల్యాండ్ రోవర్ ను చాకచక్యంగా చంద్రుడి మీద ల్యాండ్ చేయటం చంద్రయాన్ 3 ప్రయోగం మొత్తంలో హైలెట్ అంశంగా చెప్పక తప్పదు.