చంద్రయాన్-3: ల్యాండింగ్ తర్వాత తొలి ఫోటోలు వైరల్!
చంద్రుడి క్లోజప్ ఫొటోలతోపాటు జాబిల్లిపై ల్యాండ్ అవుతున్నప్పటి చిత్రాలను విక్రమ్ ల్యాండర్ తీసి పంపింది.
By: Tupaki Desk | 24 Aug 2023 4:39 AM GMTజాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ షెడ్యూలు ప్రకారం బుధవారం సాయంత్రం సరిగ్గా 6:04 గంటలకు చందమామ దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై సురక్షితంగా దిగింది. ఈ సందర్భంగా ఫస్ట్ ఫోటోను ఇస్రో విడుదల చేసింది.
అవును... చందమామపై అలా అడుగు పెట్టిందోలేదో విక్రమ్ ల్యాండర్ వెంటనే పని మొదలు పెట్టేసింది! చంద్రుడి క్లోజప్ ఫొటోలతోపాటు జాబిల్లిపై ల్యాండ్ అవుతున్నప్పటి చిత్రాలను విక్రమ్ ల్యాండర్ తీసి పంపింది. ఈ ఫోటోలను ఇస్రో షేర్ చేసుకుంది. దక్షిణ ధృవానికి సంబందించిన నాలుగు ఫొటోలను బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి సెండ్ చేసింది.
విక్రమ్ ల్యాండర్ పంపిన ఆ ఫొటోలను ఇస్రో మీడియాకి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి! ఈ ఫొటోలన్నీ బ్లాక్ అండ్ వైట్ లో ఉండగా... మొత్తం 14రోజులపాటు నిరంతరాయంగా ఫొటోలు పంపనుంది విక్రమ్ ల్యాండర్. దక్షిణ ధృవంలో తిరుగుతూ చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన క్లియర్ పిక్చర్స్ ను తీయనుంది రోవర్.
చందమామపై వాతావరణం ఎలా ఉంది? మంచు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి? అక్కడి వాతావరణం మానవ మనుగడకు అనుకూలమా? కాదా? ఇలా అనేక అంశాలపై అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ఫొటోలు పంపనుంది. ఇలా... విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధృవం నుంచి నిరంతరాయంగా పనిచేస్తూ.. అక్కడి సమాచారాన్ని చేరవేయనుంది.
కాగా... ల్యాండింగ్ పూర్తయిన కొద్దిసేపటికి బెంగళూరులోని ఇస్ట్రాక్ - మాక్స్ తో విక్రమ్ కు కమ్యూనికేషన్ సంబంధాలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.
ఆ సమయంలో... ల్యాండింగ్ విజయవంతం కాగానే.. భారత్ ను ఉద్దేశిస్తూ చంద్రయాన్-3 వ్యాఖ్యానించినట్లుగా ఒక ట్వీట్ పోస్ట్ చేసింది ఇస్రో. "నా గమ్యాన్ని చేరుకున్నాను. మీరు కూడా. శుభాకాంక్షలు" అంటూ ఆసక్తికరమైన ట్వీట్ ను ఇస్రో పోస్ట్ చేసింది.