ప్రజ్ఞాన్ మళ్లీ పని చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదట
భారతీయుల సత్తా ఎంతన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చంద్రయాన్ 3 ప్రయోగంలో.. ప్రజ్ఞాన్ రోవర్ ను అనుకున్నది అనుకున్నట్లుగా చేయటంలో విజయం సాధించటం తెలిసిందే
By: Tupaki Desk | 20 Oct 2023 4:08 AM GMTభారతీయుల సత్తా ఎంతన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చంద్రయాన్ 3 ప్రయోగంలో.. ప్రజ్ఞాన్ రోవర్ ను అనుకున్నది అనుకున్నట్లుగా చేయటంలో విజయం సాధించటం తెలిసిందే. చంద్రుడి మీద ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాల్ని కొట్టి పారేయలేమన్న మాట ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది.
ప్రయోగంలో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పజెప్పిన పనిని నూటికి నూరు శాతం పూర్తి చేయటం తెలిసిందే. భూమి మీద పద్నాలుగు రోజుల సమయం చంద్రుడి మీద ఒక పూటతో సమానమన్న విషయం తెలిసిందే. పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నట్లే.. రాత్రిళ్లు అందుకు భిన్నంగా అత్యంత శీతల పరిస్థితులు ఉండటం తెలిసిందే. నిర్ణీత గడువు ముగిసి.. రాత్రి దశకు చేరుకున్న వేల.. ప్రజ్ఞాన్ రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపటం తెలిసిందే. అయితే.. పద్నాలుగు రోజులు గడిచి.. మళ్లీ పగటి వేళ.. దాన్ని యాక్టివ్ చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.
ఈ క్రమంలో ప్రజ్ఞాన్ రోవర్ మీద ఆశలు వదిలేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా కొచ్చిన్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ నోటి నుంచి ఆసక్తికరవ్యాఖ్యలు వచ్చాయి. ప్రజ్ఞాన్ మీద ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు చెప్పారు. చంద్రుడి మీద ప్రజ్ఞాన్ ప్రస్తుతం ప్రశాంతంగా నిద్రపోతోందన్న ఆయన.. దాన్ని కదిలించకుండా నిద్రపోనిద్దామన్నారు. తనంతట తాను క్రియాశీలకం కావాలని అనుకున్నప్పుడు అది మేల్కొనే వీలుందని పేర్కొన్నారు. రోవర్ ను మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించినప్పుడు అది పని చేసిందని.. అందుకే ప్రజ్ఞాన్ మళ్లీ పని చేస్తుందన్న ఆశలు పెట్టుకోవటానికి కారణమని చెబుతున్నారు. అనూహ్య ఘటనతో అద్భుతం జరగాలని.. ప్రజ్ఞాన్ మళ్లీ నిద్ర లేవాలని ఆశిద్దాం.