చంద్రయాన్ -4 ప్రయోగం ఎలా ఉంటుందంటే?
చంద్రయాన్ 4 మిషన్ ను 2027లో చేపట్టనున్నట్లుగా చెప్పిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ఈ మిషన్ లో భాగంగా ఏమేం చేస్తారన్న వివరాల్ని తెలియజేశారు.
By: Tupaki Desk | 7 Feb 2025 5:41 AM GMT‘చంద్రయాన్’ సిరీస్ లో భాగంగా ఇప్పటికే తీపిచేదులను చవి చూసిన భారత్.. ఇందులో భాగంగా చంద్రయాన్ 4కు సిద్దమవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాత్ర.. ఈ చంద్రయాన్ సిరీస్ లో నాలుగోది. ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక సమాచారం తాజాగా బయటకు వచ్చింది. చంద్రయాన్ 4 మిషన్ ను 2027లో చేపట్టనున్నట్లుగా చెప్పిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ఈ మిషన్ లో భాగంగా ఏమేం చేస్తారన్న వివరాల్ని తెలియజేశారు.
మిషన్ లో భాగంగా రెండు వేర్వేరు ప్రయోగాలు ఉంటాయని.. ఎల్ వీఎం 3 రాకెట్ ద్వారా ఐదు రకాల టెక్నాలజీ వస్తు సామాగ్రిని కక్ష్యలోకి పంపుతారని పేర్కొన్నారు. వాటిని అక్కడే అసెంబుల్ చేయిస్తారన్న ఆయన.. ఈ ప్రయోగ లక్ష్యం చంద్రుడి నుంచి భూమికి రాళ్ల నమూనాల్ని తీసుకురావటమేనని పేర్కొన్నారు. ఈ చంద్రయాన్ 4 మిషన్ లో భాగంగా హెవీ లిఫ్టు ఎల్ వీఎం3 రాకెట్ ను రెండుసార్లు అయినా ప్రయోగిస్తామన్న ఆయన.. ‘‘ఈ రాకెట్ ద్వారా 5 కంపోనెంట్స్ ను స్పేస్ లోకి తీసుకెళ్లటం.. కక్ష్యలోకి వాటిని అసెంబుల్ చేస్తాం’’ అని పేర్కొన్నారు.
ఈ ప్రయోగంలో అంతిమంగా చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్ల నమూనాల్ని సేకరించి భూమికి తీసుకురావాలన్నదే మిషన్ లక్ష్యంగా పేర్కొన్నారు. చంద్రయాన్ 4 ప్రయోగ వివరాల్ని వెల్లడించిన వేళలోనే.. మరో ఆసక్తికర ప్రయోగ వివరాల్ని వెల్లడించారు. గగన్ యాన్ మిషన్ ను వచ్చే ఏడాది చేపడతామన్న ఆయన.. ఆ మిషన్ లో భాగంగా భారత వ్యోమగాములను భూమి అత్యల్ప కక్ష్యకు పంపి.. వారిని తిరిగి సురక్షితంగా తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ రెండు ప్రయోగాలతో పాటు వచ్చే ఏడాది సముద్రయాన్ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మిషన్ లో భాగంగా ముగ్గురు సైంటిస్టులను సబ్ మెరైన్ లో 6వేల మీటర్ల లోతుకు తీసుకొని వెళ్లి.. సముద్రపు అత్యల్ప ఉపరితలాన్ని అన్వేషిస్తారని పేర్కొన్నారు. చంద్రయాన్ మిషన్ కు సంబంధించి ఇప్పటివరకు మూడు ప్రయోగాలుజరపగా.. మొదటి.. మూడోది విజయవంతం కాగా.. రెండోది మాత్రం ఫెయిల్ అయ్యింది. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తొలి దేశంగా అవతరించింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అధ్యయనం చేయటం.. ఆ ప్రాంతం ఉపరితలం.. ప్లాస్మాపై స్టడీ చేశారు. చంద్రుడి నేల మీది ప్రకంపనల్ని కూడా నమోదు చేశారు.
ఇక్కడే ఒక అనుమానం రావొచ్చు. ఇప్పటికే చంద్రుడి మీద నమోనాల్ని అమెరికాకు చెందిన అపోలో.. రష్యాకు చెందిన లూనా మిషన్ తీసుకొచ్చినప్పుడు.. ఈ ప్రయోగం ప్రత్యేకత ఏమిటన్న సందేహం కలగొచ్చు. అయితే.. ఈ ప్రయోగాలన్ని చంద్రుడిలోని ఒకే ప్రాంతానికి చెందినవి కాగా.. చంద్రయాన్ 4 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచి నమూనాల్ని భూమికి తీసుకురావటమే ఈ మిషన్ లక్ష్యంగా చెప్పాలి. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. చంద్రుడ్ని మరింత బాగా అర్థం చేసుకోవటానికి సాయం చేస్తుంది.