చంద్రయాన్3... జాబిల్లి ఫస్ట్ ఫోటోస్ చూశారా?
చంద్రయాన్-3 వ్యోమనౌకలో ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత కొద్దిసేపటికే కొన్ని ఫోటోలు తీసి పంపించింది
By: Tupaki Desk | 19 Aug 2023 4:53 AM GMTచంద్రయాన్-3 వ్యోమనౌకలో ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత కొద్దిసేపటికే కొన్ని ఫోటోలు తీసి పంపించింది. ఈ ఫోటోలను ఇస్రో ఆన్ లైన్ లో పంచుకుంది. ఈ ఫోటోల్లో చంద్రుడిపై స్పష్టంగా కనిపిస్తోన్న బిలాల పేర్లను కూడా వెల్లడించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
అవును... అంతరిక్ష రంగంలో మరింతగా సత్తా చాటాలని ఇస్రో భావిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చంద్రుడిపై పరిశోధనల కోసం రోదసిలోకి పంపబడిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 తన లక్ష్యం దిశగా విజయవంతంగా పయనిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలకమైన ఫోటోలను పంపించింది.
చంద్రుడి కక్ష్యలో సొంతంగా పరిభ్రమిస్తున్న ల్యాండర్ విక్రమ్.. జాబిల్లి ఉపరితలం ఫొటోలను తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను ఇస్రో ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలలో జాబిల్లి ఉపరితలంపై బిలాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఫ్యాబ్రీ, గియార్డనో బ్రునో, హర్కేబి జే తదితర బిలాల ఫొటోలను ల్యాండర్ తీసింది.
ల్యాండర్ విక్రమ్ తీసిన బిలాల ఫోటోలలో గియార్డనో బ్రునో ప్రత్యేకమైంది. చంద్రుడిపై ఇటీవలే గుర్తించిన అతిపెద్ద బిలాల్లో ఇది ఒకటి. ఇక హర్కేబి జే బిలం వ్యాసం దాదాపు 43 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి!
మరోపక్క చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్ మాడ్యూల్ లక్ష్యానికి మరింత చేరువైంది. ఈ సమయంలో శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
ఇదే సమయంలో రెంబో రీ బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న తెల్లవారుజామున 2 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. రెండో విన్యాసం తర్వాత ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువ కానుంది. ఈ సమయంలో ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యంగానే ఉందని తెలిపింది.
కాగా గత నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ - 3 ని ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈ మూన్ మిషన్ ను ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది!
ఈ క్రమంలో అన్నీ మరింత సజావుగా సాగిపోతే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ కాలుమోపనుంది. ఈ అద్భుత క్షణం కోసం భారతీయులే కాదు.. యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందనే చెప్పాలి!