విశాఖ నుంచే మార్పు మొదలైంది !
దాంతో విశాఖలో ఏడాదిన్నరగా సమస్యాత్మకంగా ఈ కీలక జంక్షన్ డివైడర్ మారింది. జనాలు కూడా నానా అవస్థలు పడుతున్నారు
By: Tupaki Desk | 5 Jun 2024 5:32 PM GMTవిశాఖ చుట్టూ వైసీపీ ఆలోచనలు తిరిగేవి. విశాఖ పాలనా రాజధాని అని వైసీపీ అధినాయకత్వం అంటే విశాఖలో చేయాల్సిన దందాలు చేసే వారు చేస్తూ పోయారు. కూల్ సిటీ కాస్తా దాంతో ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో. ఇక తాను ఎంపీగా ఉన్నపుడు వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ విశాఖలోని అతి ముఖ్య కూడలి అయిన సిరిపురం జంక్షన్ లో ఏకంగా కీలక దారిని మూయించారు అని ఆరోపణలు ఉన్నాయి.
దాంతో విశాఖలో ఏడాదిన్నరగా సమస్యాత్మకంగా ఈ కీలక జంక్షన్ డివైడర్ మారింది. జనాలు కూడా నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఏపీలో చూస్తే వైసీపీ అధికారం నుంచి దిగిపోయింది. టీడీపీ కూటమి వచ్చింది. దాంతో కౌంటింగ్ అయిన మరుసటి రోజే ఈ లెక్క తేల్చే పనిలో టీడీపీ జనసేన పడ్డాయి. టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కలసి ఈ డివైడర్ ని తొలగించి ప్రజలకు ఉపశమనం కలిగించారు.
పెద్ద ఎత్తున టీడీపీ జనసేన నేతలు కలసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. దాంతో జంక్షన్ డివైడర్ ను జేసీబీ సాయంతో అంతా తొలగించారు. ఇంకా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రమాణం చేయలేదు కానీ ఒక ముఖ్య సమస్యకు పరిష్కారం చూపించారు అని నగర వాసులు అంటున్నారు.
నిత్యం చాలా సమస్యగా ఉన్న జంక్షన్ డివైడర్ ను తొలగించడం పట్ల విశాఖ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రోజంతా ఈ జంక్షన్ నుంచి వేలల్లో జనాలు ప్రయాణిస్తారు. ఇక్కడే కళాశాలలు పాఠశాలు ఉన్నాయి. అలాగే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలన్నా ఆర్టీసీ జంక్షన్ కి వెళ్ళాలన్నా ఈ రూట్ కీలకంగా ఉంది. అలాంటి చోట ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ డివైడర్ ని తొలగించడంతో చుట్టుతూ తిరిగి వెళ్లాల్సిన బాధ తొలగిపోయిందని స్థానికులు పేర్కొన్నారు. కూటమి రాకతో విశాఖకు మంచి రోజులు వచ్చాయనడానికి ఇది తొలి సంకేతం అని అంటున్నారు.