Begin typing your search above and press return to search.

లోకేష్ పాదయాత్రలో బిగ్ చేంజ్...మ్యాటరేంటి...?

టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్రలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి కారణాలు ఐతే ఏమీ తెలియడంలేదు కానీ చినబాబు పాదయాత్ర ఇపుడు జెట్ స్పీడ్ తో గమ్యం వైపుగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:28 PM GMT
లోకేష్ పాదయాత్రలో బిగ్ చేంజ్...మ్యాటరేంటి...?
X

టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్రలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి కారణాలు ఐతే ఏమీ తెలియడంలేదు కానీ చినబాబు పాదయాత్ర ఇపుడు జెట్ స్పీడ్ తో గమ్యం వైపుగా సాగుతోంది. ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలైంది. అది లగాయితూ ఆయన ఒక్క చిత్తూరు జిల్లాలోనే నెల రోజుల పాటు తిరిగారు. అక్కడ నుంచి అనంతపురంలో కూడా ఇరవై రోజులకు తక్కువ కాకుండా తిరిగారు. అలాగే కర్నూల్, కడపలతో పాటు నెల్లూరు జిల్లాలలో ప్రతీ నియోజకవర్గం టచ్ చేస్తూ లోకేష్ పాదయాత్ర సాగింది.

అయితే ప్రకాశం జిల్లాలు వచ్చేసరికే పాదయాత్ర రూట్ మ్యాప్ కంప్లీట్ చేంజి అయింది అని అంటున్నారు. ఈ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకే పాదయాత్ర పరిమితం అయింది. టీడీపీని గెలిపించిన చీరాల, పర్చూరులలో నారా లోకేష్ పాదయాత్ర చేపట్టకుండానే గుంటూరు జిల్లాకు వచ్చేశారు. ఇక గుంటూరులో చూస్తే గుంటూరు నగరంతో పాటు, రేపల్లె, బాపట్ల, పొన్నూరు, తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్ర లేదు. అంతే కాదు మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం సత్తెనపల్లిలో కూడా మొక్కుబడిగానే సాగింది. కానీ మంగళగిరిలో మాత్రం లోకేష్ అయిదు రోజుల పాటు పాదయాత్ర చేశారు.

అక్కడ నుంచి క్రిష్ణా జిల్లాలోనికి ఈ నెల 19న అడుగు పెడుతున్న లోకేష్ జస్ట్ నాలుగు రోజులు మాత్రమే పాదయాత్ర చేయనున్నారు. ఈ జిల్లాలో విజయవాడ వెస్ట్, ఈస్ట్, పెనమలూరు, గన్నవరం లలోనే పాదయాత్ర సాగనుంది. ఈ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాలుగా ఉన్న జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, మైలవరం నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్ర లేదు.

అంతే కాదు, ఇదే జిల్లాలో ఉన్న పెడన, పామర్రు, మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాలలో కూడా లోకేష్ పాదయాత్ర చేయడంలేదు. ఈ నెల 22 నుంచి ఆయన ఉభయ గోదావరి జిల్లాలలో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఎక్కువగా గోదావరి జిల్లాలలో పాదయాత్ర చేయాలని డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. ఆ తరువాత ఉత్తరాంధ్రాకు వచ్చి అక్కడ మూడు జిల్లాలను తొందరగా ముగించాలని చూస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది నవంబర్ లోగానే లోకేష్ పాదయాత్రను ముగించేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు.

ఒక వైపు ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపధ్యం ఉంది. మరో వైపు పార్టీ చాలా విషయాల్లో ఆలోచిస్తోంది. పొత్తులు కనుక లేకపోతే సింగిల్ గా దిగాలని అనుకుంటోంది. ఈ పరిణామాల నేపధ్యంలో లోకేష్ పాదయాత్ర ముగించి పార్టీతో నిరంతరం ఉంటూ చాలా విషయాలను పంచుకోవాలని చూస్తున్నారు. అందుకే దానికి తగినట్లుగా పాదయాత్రలో మర్పులు చేసారని అంటున్నారు.

అయితే ఈ విధంగా లోకేష్ పాదయాత్రను కుదించడం పట్ల తమ్ముళ్ళు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే లోకేష్ ఇప్పటికే 2500 కిలోమీటర్లు నడిచారు. మరో పదిహేను వందలు నడిస్తే నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర టార్గెట్ పూర్తి అవుతుంది. అందుకే పార్టీ ఈ బిగ్ చేంజిని చేస్తోంది అని అంటున్నారు. అంతే కాదు, రాయలసీమ జిల్లాలో వైసీపీ గ్రాఫ్ ని తగ్గించేందుకే ఎక్కువగా లోకేష్ తిరగాల్సి వచ్చిందని, కోస్తా జిల్లాలలో ఎటూ టీడీపీకి మొగ్గు ఉంటుంది కాబట్టి లోకేష్ పాదయాత్రలో చేంజి చేసినా ఇబ్బంది రాదన్నది పార్టీ పెద్దల వ్యూహంగా ఉంది అని అంటున్నారు.