బాబూ చంటీ... పవన్ ని కలిసిన మరుసటిరోజే ఇంత పెద్ద డైలాగా?
ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మూడోరోజు పవన్ కల్యాణ్ పర్యటన సాగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 Dec 2023 9:52 AM GMTప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మూడోరోజు పవన్ కల్యాణ్ పర్యటన సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల నుంచి నాయకులను పిలిపించుకుని.. ఏయే నియోజకవర్గాల్లో జనసేన గెలుపు అవకాశాలున్నాయనే విషయంపై చర్చిస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో పవన్ ని కలిసిన జ్యోతుల చంటిబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి!
అవును... ప్రస్తుతం జగ్గంపేట రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదనే సంకేతాలు వచ్చాయని తెలుస్తుంది. ఈసారి ఈ టిక్కెట్ తోట నర్సింహంకు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతుల చంటిబాబు పవన్ కల్యాణ్ తో సుమారు గంట సేపు భేటీ అయ్యారు!
ఈ భేటీలో వీరిద్దరితో పాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా ఉన్నారని తెలుస్తుంది! దీంతో ఈ తాజా భేటీపై నియోజకవర్గంలో కార్యకర్తలతో చర్చించారు చంటిబాబు. ఈ సందర్భంగా ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా... జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు లేవని చెప్పడం గమనార్హం.
ఈ సందర్భంగా... పవన్ కళ్యాణ్ తో జరిగిన సమావేశంపై అనుచరులతో మాట్లాడిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు... జనసేన అధినేత పవన్ కళ్యాణే తనని పిలిచారని, అందుకే తాను వెళ్లి మాట్లాడానని తెలిపారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తనను జిల్లా రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... జగ్గంపేటలో టీడీపీ, జనసేన పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో ఈసారి వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్ తోట నర్సింహానికి ఇస్తే సహకరించేది లేదని చంటిబాబు నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో సర్వేలతో టిక్కెట్లు కన్ ఫాం చేయడానికి... అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేసిందేమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 1న కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇదే సమయంలో వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఈయన పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోపక్క జనసేన అధినేత నుంచి చంటిబాబుకు వచ్చిన హామీ ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఇంకోపక్క... జ్యోతుల నెహ్రూ టీడీపీలో కీలకంగా ఉన్న నేపథ్యంలో... చంటిబాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవటిలా మారిపోయే ప్రమాదాన్ని కూడా కొట్టిపారేయలేమనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
మరోపక్క టీడీపీ - జనసేన కూటమిలో భాగంగా జగ్గంపేట టిక్కెట్ టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూకే దక్కుతుందని అంటున్నారు. ఈ సమయంలో వైసీపీ నుంచి పక్క చూపులు చూస్తున్న చంటిబాబుపై నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. అతడిని టీడీపీలోకి రానిచ్చేది లేదని అన్నారు. చంటిబాబు ఇప్పుడు టీడీపీలోకి రావడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నెహ్రూ తేల్చి చెప్పారు. ఒకవేళ చంటిబాబుని పార్టీలోకి ఆహ్వానిస్తే తాను ఊరుకోనని నెహ్రూ హెచ్చరికలు పంపారు!