ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లను వెనక్కి నెట్టి ChatGPT రికార్డు
ఏఐ రంగంలో ఒక కొత్త శకం ఆరంభమైంది. మార్చి నెలలో ChatGPT సంచలనం సృష్టించింది.
By: Tupaki Desk | 13 April 2025 5:05 AMఏఐ రంగంలో ఒక కొత్త శకం ఆరంభమైంది. మార్చి నెలలో ChatGPT సంచలనం సృష్టించింది. సాంకేతిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా అవతరించింది. ఈ అనూహ్య విజయం ఏఐ పవర్, ChatGPT ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది.
మార్చి నెలలో ChatGPT ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన నాన్-గేమింగ్ యాప్‌గా రికార్డు సృష్టించింది. చాలాకాలంగా మొదటి స్థానంలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లను ChatGPT అధిగమించడం విశేషం. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ యాప్‌ఫిగర్స్ ప్రకారం.. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో ChatGPT డౌన్‌లోడ్‌లు 28శాతం పెరిగి 46 మిలియన్లకు చేరుకున్నాయి. ఇది ChatGPT చరిత్రలోనే అత్యధిక డౌన్‌లోడ్‌లు నమోదైన నెలగా నిలిచింది.
ఇన్‌స్టాగ్రామ్ రెండో స్థానానికి పడిపోగా, టిక్‌టాక్ మూడో స్థానంలో నిలిచింది. మెటా యాప్‌లు ఫేస్‌బుక్, వాట్సాప్ వరుసగా నాల్గవ, ఐదవ స్థానాల్లో ఉన్నాయి.మార్చి నెలలో ChatGPTలో వచ్చిన ప్రధాన అప్‌గ్రేడ్‌ల కారణంగా డౌన్‌లోడ్‌లు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ChatGPT ఒక సంవత్సరం తర్వాత ఇమేజ్-జనరేషన్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. స్టూడియో గిబ్లీ ఫోటోలు, మీమ్స్‌లను క్రియేట్ చేయడం ద్వారా వినియోగదారులను ఆకర్షించింది.
ఓపెన్ AI యాప్ వాయిస్ ఫీచర్‌ను మెరుగుపరచింది. కొన్ని ఇమేజ్ కంటెంట్ పరిమితులను సడలించింది.అయితే, యాప్‌ఫిగర్స్ సీఈవో ఏరియల్ మైఖేలీ ప్రకారం.. ChatGPT వృద్ధి ఫీచర్ల కంటే బ్రాండ్ ఆధిపత్యం కారణంగానే ఎక్కువగా ఉంది. "సెర్చ్‌లో గూగుల్ ఎలా ఆధిపత్యం చెలాయించిందో, AIలో ChatGPT అలా మారుతోంది" అని ఆయన అన్నారు. గ్రోక్, మానుస్ AI లేదా డీప్‌సీక్ వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించే వినియోగదారులు కూడా ChatGPTతోనే ప్రారంభిస్తున్నారు. ఇది దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
ఈ ఆధిపత్యం పోటీదారులకు సవాళ్లను విసురుతోంది. ఉదాహరణకు.. ఆంత్రోపిక్ క్లాడ్ ఆదరణ పొందడానికి కష్టపడుతోంది. అయితే ఎలోన్ మస్క్ మద్దతుతో Xలో ప్రచారం అవుతున్న గ్రోక్ కూడా ఎక్కువ ఆదరణ పొందుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో టిక్‌టాక్ వృద్ధి అమెరికాలో నిషేధం కారణంగా పెరిగింది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ చైనా-ఆధారిత మాతృ సంస్థ బైట్‌డాన్స్‌తో చర్చలు జరుపుతుండడంతో నిషేధం తాత్కాలికంగా నిలిపివేసింది.
2024 అంతటా యాప్ డౌన్‌లోడ్‌లలో అగ్రస్థానంలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అమెరికాలో ముఖ్యంగా టీనేజర్లలో ఇప్పటికీ బలంగా ఉంది. పైపర్ శాండ్లర్ సర్వే ప్రకారం.. అమెరికన్ టీనేజర్లలో 87శాతం మంది నెలవారీగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. టిక్‌టాక్ 79%, స్నాప్‌చాట్ 72% మంది వినియోగిస్తున్నారు. మార్చిలో ఇతర అగ్రశ్రేణి యాప్‌లలో క్యాప్‌కట్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్, థ్రెడ్స్, టెము ఉన్నాయి. మొత్తంమీద, టాప్ 10 యాప్‌లు మార్చిలో 339 మిలియన్ డౌన్‌లోడ్‌లను నమోదు చేశాయి. ఇది ఫిబ్రవరిలో 299 మిలియన్లుగా ఉంది.