సోషల్ మీడియాలో ‘ఘిబ్లి’ హవా.. మీ ఫొటోలను ఏఐ ఎలా వాడుకుంటుందో తెలుసా?
అయితే, ఈ ట్రెండ్‌లో మునిగి తేలుతున్న యూజర్లకు సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
By: Tupaki Desk | 1 April 2025 7:21 AMఏఐ టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏం ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్న ట్రెండ్ చాట్‌జీపీటీ ‘ఘిబ్లి’ ఆర్ట్ ఫీచర్. మార్చి 26న విడుదలైన ఈ ఫీచర్ ద్వారా మిలియన్ల మంది యూజర్లు తమ సాధారణ ఫోటోలను స్టూడియో ఘిబ్లి యానిమేషన్ శైలిలోకి మార్చుకుంటున్నారు. ఫన్నీ, క్యూట్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌కు విపరీతమైన ఆదరణ లభించడంతో మార్చి 30న ఒక్కసారిగా చాట్‌జీపీటీ సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి.
అయితే, ఈ ట్రెండ్‌లో మునిగి తేలుతున్న యూజర్లకు సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాట్‌జీపీటీ ‘ఘిబ్లి’ ఫీచర్ వినియోగం మీ వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం కలిగించవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. OpenAI అందిస్తున్న ఈ AI ఆర్ట్ జనరేటర్ ద్వారా యూజర్ల వ్యక్తిగత ఫోటోలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చాలా మంది నిపుణులు సోషల్ మీడియా వేదికగా ఈ ట్రెండ్‌పై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. యూజర్లు అప్‌లోడ్ చేస్తున్న వ్యక్తిగత ఫోటోలు చాట్‌జీపీటీకి అందుబాటులో ఉండవచ్చని, వీటిని AI మోడళ్లకు మరింత శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించవచ్చని వారు సూచిస్తున్నారు.
ఈ ట్రెండ్‌లో భాగంగా చాలా మంది వినియోగదారులు తెలియకుండానే వారి వ్యక్తిగత ఫోటోలు, ప్రత్యేకమైన ఫేస్ డేటాను OpenAIతో పంచుకుంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో గోప్యతకు సంబంధించిన భారీ నష్టాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. OpenAI డేటా సేకరణ పద్ధతులు AI కాపీరైట్ సమస్యలను తప్పించుకోవడానికి , చట్టపరమైన పరిమితులు లేకుండా సమర్పించిన ఫోటోలను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కంపెనీకి కలిగిస్తాయని టెక్ విమర్శకులు వాదిస్తున్నారు.
కొందరు సైబర్ సెక్యూరిటీ న్యాయవాదులు GDPR వంటి నిబంధనలను ఉల్లంఘించి, ‘ఘిబ్లి’ ట్రెండ్ వినియోగదారుల పూర్తి అనుమతి లేకుండా వారి ఫేస్ డేటాను ఉపయోగించుకునే వెసులుబాటును OpenAIకి అందిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, వినియోగదారులు ఈ ట్రెండ్ నుంచి దూరంగా ఉండాలని, వ్యక్తిగత ఫోటోలను అప్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలని వారు కోరుతున్నారు.
సోషల్ మీడియాలో ‘ఘిబ్లి’ ఫీచర్ ఎంతగా వైరల్ అవుతోందంటే, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి ఏ ప్లాట్‌ఫామ్ తెరిచినా ఇదే కనిపిస్తోంది. ఈ ఫీచర్ విడుదలైన కేవలం గంటలోనే మిలియన్ (10 లక్షలు) మంది కొత్త యూజర్లు చాట్‌జీపీటీలో చేరారని OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ స్వయంగా వెల్లడించారు. ఇది ఈ ఫీచర్‌కు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. అయితే, ఉచిత యూజర్లు రోజుకు కేవలం 3 ఫోటోలను మాత్రమే జనరేట్ చేసుకోగలరని పరిమితి విధించినప్పటికీ, తాజాగా ఆ పరిమితిని ఎత్తివేసినట్లు సమాచారం. చాలా మంది యూజర్లు చాట్‌జీపీటీ, గ్రోక్ ఏఐ సహాయంతో ఈ ‘ఘిబ్లి’ స్టైల్ ఫోటోలను క్రియేట్ చేసుకుంటున్నారు. మొత్తానికి, చాట్‌జీపీటీ ‘ఘిబ్లి’ ఫీచర్ ట్రెండింగ్‌లో ఉన్నప్పటికీ, దాని వల్ల మీ వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రెండ్ వెంట పరుగులు తీసే ముందు మీ ప్రైవసీ గురించి ఒకసారి ఆలోచించడం మంచిది.