అవును.. చాట్ జీపీటీ ఒక పిల్లాడి ప్రాణాల్ని కాపాడింది
ఆ రిపోర్టుల్ని పరిశీలించిన చాట్ జీపీటీ.. ఆ కుర్రాడు "టెదర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్" అనే అరుదైన నరాల సంబంధిత సమస్యతో బాధ పడుతున్నట్లుగా గుర్తించింది.
By: Tupaki Desk | 13 Sep 2023 6:04 AM GMTకృత్రిమ మేధ ఎంత అద్భుతమన్న విషయాన్ని చెప్పే ఉదంతమిది. నాలుగేళ్ల పిల్లాడ్ని కాపాడిన వైనం గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికాకు చెందిన నాలుగేళ్ల కుర్రాడు అనారోగ్యానికి గురయ్యాడు. అతడి ఆరోగ్య సమస్య ఏమిటన్న విషయాన్ని మహా మహా వైద్యులే గుర్తించలేకపోయారు. కానీ.. వారెవరూ చేయలేని పనిని కృత్రిమ మేధ చేసేసింది. అదెలానంటే.
అమెరికాకు చెందిన కోర్టనీ అనే మహిళకు నాలుగేళ్ల కొడుకున్నాడు. అతడి పేరు అలెక్స్. పంటి నొప్పి.. ఎత్తు పెరగకపోవటం.. తలనొప్పితో సహా చాలా ఆరోగ్య సమస్యలు అతడ్ని వెంటాడేవి. దీంతో అతడి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కోసం ఆమె పదిహేడు మంది వైద్యుల్ని చూపించారు. పలు వైద్య పరీక్షలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. అతడి సమస్య ఏమిటన్న విషయాన్ని గుర్తించలేకపోయారు.
దీంతో.. ఏమీ పాలుపోని ఆమె.. తన కుమారుడి సమస్యను.. అతడికి చేయించిన వివిధ వైద్య పరీక్షల వివరాల్ని చాట్ జీపీటీ ఇన్ పుట్ గా ఇచ్చారు. ఆ రిపోర్టుల్ని పరిశీలించిన చాట్ జీపీటీ.. ఆ కుర్రాడు "టెదర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్" అనే అరుదైన నరాల సంబంధిత సమస్యతో బాధ పడుతున్నట్లుగా గుర్తించింది. చాట్ జీపీటీ ఇచ్చిన సూచన మేరకు మరోసారి సంబంధిత వైద్యుడి వద్దకు వెళ్లగా.. ఆ తరహా పరీక్షలు చేయించగా.. చాట్ జీపీటీ చెప్పిందే నిజమని తేలింది. వెంటనే వైద్యులు సర్జరీ చేశారు. ఇప్పుడా బాలుడు కోలుకుంటున్నాడు. వెన్నుముకలో కండరాల కదలికలు సరిగా లేకపోవటంతో తలెత్తే నరాల సమస్య ఈ వ్యాధి కారకంగా చెబుతారు.