విమానలకు బెదిరింపులు "పిల్ల" చేష్టలు... అసలేం జరిగిందంటే..?
పోలీసులు మాత్రం లోపల గరం గరం అవుతారని అనుకుంటుండటం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలానే జరిగాయి!
By: Tupaki Desk | 17 Oct 2024 3:57 AM GMTఇటీవల కాలంలో స్కూల్స్ లోనూ, రైల్వే స్టేషన్ లో నూ బాంబులు పెట్టినట్లు పోలీసులకు ఫోన్లు రావడం.. వారు హుటాహుటిన అక్కడకు వెళ్లి తనిఖీలు చేయడం.. ఆనాక అది ఫేక్ కాల్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకోగా, పోలీసులు మాత్రం లోపల గరం గరం అవుతారని అనుకుంటుండటం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలానే జరిగాయి!
అయితే ఇలాంటి ఫేక్ కాల్స్ విమానాల విషయంలోనూ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా గడిచిన మూడు నెలల్లో సుమారు 19 విమానాలు భద్రతా ముప్పును ఎదుర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇక వీటిలో ప్రధానంగా గడిచిన 24 గంటల్లోనే 9 విమానాలకు బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇవి "పిల్ల" చేష్టలు అని తేలిందట!
అవును... విమానాలకు బాంబు బెదిరింపుల ఘటనలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా నకిలీవేనని వెల్లడైంది! అయితే... తాజాగా ముంబై నుంచి బయలుదేరిన విమానాల ఘటనకు ఓ మైనర్ బాలుడు కారణం అని, అతడు చేసిన పిల్ల చేష్టలే కారణం అని గుర్తించిన అధికారులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ముంబై నుంచి బయలుదేరిన విమానాలకు భద్రతా ముప్పు ఉందంటూ పోస్ట్ పెట్టిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో... దీనికి కారణం ఛత్తిస్ గఢ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడు (17) సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు.
దీంతో సదరు వ్యాపారవేత్తకు సమన్లు పంపిన పోలీసులు.. ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించారు. ఈ సందర్భంగా.. డబ్బుల విషయంలో తన స్నేహితుడికి తనకూ గొడవ జరిగిందని.. దీంతో అతడిని ఇరికించేందుకు అతడి పేరుతో ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసి, పలు విమానాలకు బెదిరింపు పోస్టులు పెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు... మూడు విమానాలకు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడ్డ మైనర్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. సంబంధిత దర్యాప్తు సంస్థలు ఆయా కేసులపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయని వెల్లడించారు!