వాసుపల్లి సీటుకు మైనారిటీతో చెక్ !
2019 నాటికి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ద్రోణం రాజు శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చింది.
By: Tupaki Desk | 3 Feb 2024 4:16 AM GMTవిశాఖ సౌత్ నియోజకవర్గం విషయంలో వైసీపీ కొత్తగా సర్వే చేయిసోంది. ఈ సీటులో బ్రాహ్మణ, మత్స్య మైనారిటీ, బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ 2014లో మత్య్స కార సామాజిక వర్గానికి చెందిన కోలా గురువులుకు టికెట్ ఇచ్చింది. 2019 నాటికి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ద్రోణం రాజు శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చింది. ఈ రెండు సార్లూ ఇద్దరూ టీడీపీ చేతిలో ఓటమి పాలు అయ్యారు.
ఇక ఆ తరువాత తరువాత టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరిపోయారు. ఆయనకే టికెట్ అని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. అయితే ఇపుడిపుడే లెక్కలు మారుతున్నాయి. వాసుపల్లి వైసీపీలో ఉన్న వారిని కలుపుకుని పోవడంలో ఫెయిల్ కావడం అలాగే చాలా మంది వైసీపీ కార్పోరేటర్లు పార్టీని వీడిపోవడం ఉన్న వారు సైతం వాసుపల్లికి టికెట్ ఇస్తే సహకరించేది లేదు అని ఖరాఖండీగా చెప్పడంతో అధినాయకత్వం పునరాలోచనలో పడింది అని అంటున్నారు.
ఇటీవల విశాఖ జిల్లా భీమిలీలో జరిగిన వైఎస్ జగన్ సిద్ధం సభ కోసం సన్నాహక సమావేశం సౌత్ లో వాసుపల్లి నిర్వహిస్తే కేవలం ఒక్కరంటే ఒక్క కార్పోరేటర్ హాజరై ఆయనకు షాక్ ఇచ్చారు. ఈ పరిణామంతో వైసీపీ పూర్తిగా వాసుపల్లి విషయంలో ఒక క్లారిటీకి వచ్చేసింది అని అంటున్నారు. వాసుపల్లి సైతం ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా తన విద్యా సంస్థలో అందరికీ మందు బాటిల్స్ పంపిణీ చేసి వివాదంలో ఇరుక్కున్నారు
పైగా ఆయన మూడు సార్లుగా పోటీ చేస్తూ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పట్ల జనంలో యాంటీ ఇంకెంబెన్సీ ఉందని వైసీపీ సర్వేలో తేలింది. కేవలం లక్ష ఓట్లు మాత్రమే ఉండే అతి చిన్న నియోజకవర్గం విశాఖ సౌత్. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. ఒక విధంగా ఆ పార్టీకి కంచుకోట. మళ్ళీ వాసుపల్లికి టికెట్ ఇస్తే టీడీపీకి సీటు రాసిచ్చేసినట్లే అని అంటున్నారు.
దాంతో వైసీపీ ఇక్కడ నుంచి మైనారిటీ అభ్యర్ధిని బరిలోకి దించాలని చూస్తోంది. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం అంటే 1994లో అన్న గారి ఆశీస్సులతో తొలిసారి ఎమ్మెల్యే అయిన డాక్టర్ ఎస్ ఎ రహమాన్ నాలుగేళ్ల క్రితం వైసీపీలో చేరారు. ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అని సర్వే చేయిస్తోంది అని అంటున్నారు. ఆయన సీనియర్ పొలిటీషియన్. దాంతో ఆయనకు టికెట్ ఇస్తే విశాఖ నార్త్ తో పాటు భీమిలీలోనూ ఎంతో కొంత ప్రభావం ఉండవచ్చు అని భావిస్తున్నారుట. మరి వాసుపల్లికి చెక్ చెప్పాలంటే మైనారిటీనే ముందుకు తేవడం మంచిది అన్నది వైసీపీలో కొత్త ఆలోచన అని అంటున్నారు.