Begin typing your search above and press return to search.

ఇల్లు లేదా స్థలం.. ఇలా ఉంటే అనుమతులు ఉన్నా కొనకపోవడమే ఉత్తమం!

అవును... భాగ్యనగరంలో ఓ ఇల్లు.. లేదా, స్థలం అనేది హైదరాబాద్ తో పరిచయం ఉన్న చాలా మందికి అతిపెద్ద కల! దీనికోసం లైఫ్ మొత్తం కష్టపడి మరీ డబ్బు కూడబెడుతుంటారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 5:06 AM GMT
ఇల్లు లేదా స్థలం.. ఇలా ఉంటే అనుమతులు ఉన్నా కొనకపోవడమే ఉత్తమం!
X

హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఎంట్రీ తర్వాత భూములు, ఇళ్లు వంటివి కొనే విషయంలో తీవ్ర అప్రమత్తత అనేది మొదలైందని అంటున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్.టీ.ఎల్.), బఫర్ జోన్ వంటి అంశాలపై ఇప్పుడు దాదాపు అందరికీ అవగాహన రావడంతో... అనుమతులు ఉన్నట్లు అనిపించినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

అవును... భాగ్యనగరంలో ఓ ఇల్లు.. లేదా, స్థలం అనేది హైదరాబాద్ తో పరిచయం ఉన్న చాలా మందికి అతిపెద్ద కల! దీనికోసం లైఫ్ మొత్తం కష్టపడి మరీ డబ్బు కూడబెడుతుంటారు. లేదా.. లైఫ్ అంతా కష్టపడి తీర్చడానికి సిద్ధపడి ఇంటి రుణం తీసుకుంటారు. అలాంటప్పుడు.. వీటిని కొనే విషయంలో అత్యంత అప్రమత్తత అవసరం. అదెలానో ఇప్పుడు చూద్దాం...!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (హీ.హెచ్.ఎం.సీ), హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్.ఎం.డీ.ఏ), డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ & కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), ముస్నిపాలిటీ వంటి సంస్థల అనుమతులు ఉన్నాయని మీడియేటర్ చెప్పగానే.. ఆ మాటలు గుడ్డిగా నమ్మి ఆస్తి కొనే విషయంలో తొందరపడకూడదు!

ముందుగా కొనలనుకుంటున్న ఇంటికి లేదా ఆస్తికి యాజమాన్య హక్కు ఎవరి పేరుతో ఉందనేది చూసుకోవాలి. ఆ హక్కు ఉన్న వ్యక్తికి వారసులు ఉన్నారా.. దీనిపై ఏమైనా కేసులు ఉన్నాయా.. అమ్మే వ్యక్తివద్ద ఉన్నవి అసలు పత్రాలేనా వంటి విషయాలు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడం అనేది ఆస్తి లేదా ఇల్లు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలో బేసిక్స్!

అనంతరం... కొనాలనుకున్న ఆస్తి సర్వే నంబరుతో రిజిస్ట్రేషన్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ ను సంప్రదించి టైటిల్ తాజా పరిస్థితిని తెలుసుకోవాలి. లింక్ డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విషయంలో మంచి లాయర్ ను సంప్రదించడం బెటర్! అన్నీ సక్రమంగా ఉన్నట్లు అభిప్రాయం తీసుకున్న తర్వాతే అడ్వాన్స్ లు ఇవ్వడం వంటి ఆలోచనలు చేయాలి.

ఇక ప్రధానంగా లేక్ వ్యూ అంటూ చెరువుల దగ్గర ఫ్లాట్లను ప్రీమియర్ ధరలకు అమ్మేస్తుంటారు.. దాన్ని చాలా మంది బీచ్ వ్యూ లా భావిస్తుంటారు! ఈ విషయంలో హైడ్రా ఎంట్రీ తర్వాత చాలా మందికి క్లారిటీ వచ్చే ఉంటుంది. ప్రధానంగా రెవెన్యూ ఆఫీసుకు వెళ్లి కొనాలనుకున్న ఆస్తి సర్వే నెంబర్ ఆధారంగా ఎఫ్.టీ.ఎల్. లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదా తెలుసుకోవాలి!

ఈ క్రమంలో హెచ్.ఎం.డీ.ఏ.కు చెందిన వెబ్ సైట్ లో ఈ వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...!!

దీని కోసం ముందుగా "లేక్స్.హెచ్ఎండీఏ.జీవోవీ.ఇన్" అనే వెబ్ సైట్ లోకి వెళ్లి... అందులోని ఎఫ్.టీ.ఎల్. కాలంలో "క్లిక్" అని బ్లూ కలర్ ఉంటుంది! దానిపై క్లిక్ చేయగానే ఓ మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎఫ్.టీ.ఎల్. వరకూ చెరువు విస్తీర్ణం ఎంత అనే వివరాలు ఉంటాయి. తర్వాత వెనక్కి వచ్చి.. క్యాడస్ట్రల్ పై క్లిక్ చేస్తే మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ చెరువు ఏ సర్వే నెంబర్ల పరిధిలో ఉందో తెలుస్తుంది.

అక్కడ కనిపించే మ్యాప్ లో బ్లూ కలర్ లైన్ తో ఉన్నది ఎఫ్.టీ.ఎల్. పరిధి కాగా.. రెడ్ కలర్ లో ఉన్నది బఫర్ జోన్. ఇక ఆరెంజ్ రంగులో ఉన్నది చెరువు కట్ట అన్నమాట. దీని ప్రకారం మీ స్థలం లేదా అపార్ట్మెంట్ చెరువుకు ఎటువైపు ఉందో చెక్ చేసుకొవచ్చు. ఒకవేళ వీటి మధ్యలో ఉన్నట్లయితే... అనుమతులు ఉన్నప్పటికీ కొనకపొవడం ఉత్తమం! డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా!