అడుగు దూరానికి చిరుత.. ఆ బస్సులో జర్నీ చేసినోళ్ల పరిస్థితేంటి?
అలాంటి వేళలో.. ఒక్కసారిగా చిరుత బస్సు కిటికీ మీదకు దూకి..
By: Tupaki Desk | 8 Oct 2024 7:30 AM GMTసరదాగా షికారుకు వెళ్లటం.. దూరం నుంచి చిరుతను చూడటం.. సంతోషించటం.. చేతిలోని సెల్ ఫోన్ కు పని చెబుతూ చకాచకా ఫోటోలు తీయటం వరకు బాగుంటుంది. అలాంటి వేళలో.. ఒక్కసారిగా చిరుత బస్సు కిటికీ మీదకు దూకి.. అడుగు కంటే తక్కువ దూరానికి వచ్చిన అనుభవం ఎదురైతే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా గుండె జారి చేతికి వచ్చినట్లుగా ఉంటుంది కదా? సరిగ్గా అలాంటి షాకింగ్ అనుభవం తాజాగా చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
బెంగళూరు నగర శివారు బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనంలో ఆదివారం ఒక చిరుత సఫారీ బస్సు మీదకు దాడికి ప్రయత్నించింది. అయితే.. బస్సులో ప్రయాణించిన ప్రయాణికులకు ఏం కాలేదు. కాకుంటే.. తీవ్రమైన టెన్షన్ కు గురైన పరిస్థితి. సఫారి బస్సులోని వెనుక కిటికీ తెరిచి ఉన్న వైపు చిరుత ఒక్కసారిగా దూకింది. అయితే.. కిటికికి అడ్డంగా ఇనుప గ్రిల్ ఉండటంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ బస్సుపై సదరు చిరుత పదే పదే కిటికీపై దూకిన వైనంతో ప్రయాణికులు తీవ్రమైన టెన్షన్ కు గురయ్యారు. సఫారి వేళ.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సును డిజైన్ చేసినప్పటికి.. అడుగు దూరానికి చిరుత వచ్చేసిన అనుభవం బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు షాకింగ్ గామారింది. ఈ బస్సులోని వారంతా తీవ్రమైన భయాందోళనలకు గురైతే.. వెనుక ఉన్న బస్సులోనివారు మాత్రం చిరుత బస్సుపైకి దూకే ప్రయత్నానికి సంబంధించిన ద్రశ్యాల్ని రికార్డు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి.. వైరల్ గా మారింది. ఏమైనా.. అడుగు దూరానికి దూసుకొచ్చిన చిరుత ఉదంతం ఎంతటి ధైర్యస్తుడికైనా వణుకు పుట్టేలా చేస్తుందని చెప్పాలి.