తిరుమలలో పెను విషాదం.. చిరుతదాడిలో బాలిక మృతి!
దీంతో శనివారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద బాలిక మృత దేహం గుర్తించారు.
By: Tupaki Desk | 12 Aug 2023 5:14 AM GMTతిరుమలలో కాలి నడక మార్గంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల కొండ పైకి వెళ్తున్న సమయంలో బాలిక అదృశ్యం అయింది. అధికారులకు సమాచారం ఇవ్వటంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. శనివారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద బాలిక మృత దేహం గుర్తించారు.
అవును... శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన ఓ కుటుంబం బిడ్డను పోగొట్టుకుంది. నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం తిరుమలకు బయల్దేరింది. రాత్రి 8 గంటల సమయంలో అలిపిరి నుంచి నడకమార్గంలో కొండపైకి బయల్దేరింది. రాత్రి 11గంటల సమయానికి కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామి గుడి దాకా చేరుకుంది.
అనంతరం ఒక్కసారిగా పాప లక్షిత కనిపించకుండా పోయింది. ఏమైందని మొత్తం అంతా గాలించారు. కానీ ఎక్కడా కనిపించలేదు. పోలీస్ స్టేషన్ లో పాప కనిపించడం లేదని ఫిర్యాదుచేశారు. పోలీసులు కూడా మిస్సింగ్ కేసే నమోదు చేసి గాలింపు చేపట్టారు.
అయితే ఎక్కడ అనుమానం వచ్చిందో, ఏ క్లూ దొరికిందో తెలియదు గానీ.. అడవిలో గాలింపు మొదలుపెట్టారు ఫారెస్ట్ సిబ్బంది. దీంతో శనివారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద బాలిక మృత దేహం గుర్తించారు. దీంతో.. తిరుమల పరిసరాల్లో తీవ్ర్ విషాదం నెలకొంది.
కాగా... ఈ ఏడాది జూన్ 23న తిరుమల నడకదారిలో ఇలాంటి ఘటనే జరిగిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కు చెందిన శిరీష, కొండయ్యల కుటుంబ సమేతంగా జూన్ 23న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. నడకమార్గంలో ఐదేళ్ల కౌశిక్ తో వెళ్తుండగా ఏడో మైలురాయి దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.
చిరుత అమాంతం కౌశిక్ మెడ కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. చుట్టూ ఉన్న వాళ్లు కేకలేయడంతో వెంటనే వదిలేసి పరారైంది. చిరుత దాడిలో బాలుడు కౌశిక్ తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స తర్వాత మెల్లిగా కోలుకున్నాడు.