పవన్ కు షాక్.. వైసీపీలోకి జోగయ్య కుమారుడు!
మార్చి 1న సాయంత్రం చేగొండి సూర్యప్రకాశ్... సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
By: Tupaki Desk | 1 March 2024 12:32 PM GMTఅసెంబ్లీ ఎన్నికల ముంగిట జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాపు సంక్షేమ సేన సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఆయన వైసీపీ తీర్థం కోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తాడేపల్లికి చేరుకున్న ఆయన మరికొద్ది గంటల్లో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
జనసేన పార్టీ టీడీపీ పొత్తులో భాగంగా 24 సీట్లే తీసుకోవడం, అధికారంలో షేరింగ్ పై సమాధానం ఇవ్వకపోవడం, సలహాలు, సూచనలు ఇస్తున్న తన తండ్రిని పరోక్షంగా అవమానిస్తూ మాట్లాడటం వంటి చర్యలతో చేగొండి సూర్యప్రకాశ్ నొచ్చుకున్నారని తెలుస్తోంది.
2018లో చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీలో చేరారు. 2022లో ఆయనను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా నియమించారు. పవన్ కళ్యాణ్ వైఖరికి నిరసనగానే జోగయ్య కుమారుడు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మార్చి 1న సాయంత్రం చేగొండి సూర్యప్రకాశ్... సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే చేగొండి సూర్యప్రకాశ్ తాడేపల్లి చేరుకున్నట్టు తెలుస్తోంది. మరికొద్దిసేపటిలోనే ఆయన వైసీపీలో చేరనున్నారు.
టీడీపీతో సీట్ల పంపకాల్లో భాగంగా జనసేన తక్కువ సీట్లే తీసుకోవడం, ఐదు సీట్లు మినహా అభ్యర్థులను ప్రకటించకపోవడం, తాను పోటీ చేసే సీటుపై స్పష్టత ఇవ్వకపోవడం వంటి కారణాలతో చేగొండి సూర్యప్రకాశ్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
ఇంకోవైపు సూర్యప్రకాశ్ తండ్రి హరిరామజోగయ్య సైతం పవన్ కళ్యాణ్ తీసుకున్న సీట్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిత్యం ఈ అంశంపై, పవర్ షేరింగ్ పై పవన్ ను ఉద్దేశించి లేఖలు రాస్తున్నారు. జనసైనికులు ఆవేదన చెందుతున్నారని, కనీసం 40 సీట్లలో అయినా పోటీ చేయాలని చెబుతున్నారు.
అయితే చేగొండి సూచనలను పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. తనకు సలహాలు, సూచనలు ఇవ్వవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపం చెందిన చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు.