Begin typing your search above and press return to search.

రాజమండ్రి రూరల్ లెక్క... మంత్రికి బిగ్ టాస్కే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   16 Jan 2024 4:30 PM GMT
రాజమండ్రి రూరల్ లెక్క... మంత్రికి బిగ్ టాస్కే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ సమయంలో పొత్తులో భాగంగా జనసేన పార్టీ ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కీలక స్థానాలు కోరుతున్నట్లు కథనాలొస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలనేది వారి ఆకాంక్షగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ పైనా జనసేన కర్చీఫ్ వేసిందని అంటున్నారు.

వాస్తవానికి రాజమండ్రి రూరల్ అనేది టీడీపీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో భాగంగా చాలా కంచుకోటలకు బీటలు వారినప్పటికీ.. రాజమండ్రి రూరల్ ని మాత్రం బుచ్చయ్య చౌదరి నిలబెట్టుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం వరుసగా రెండుసార్లూ ఆయన ఈస్థానం నుంచి గెలుపొందారు. ఈ దఫా కూడా తనకు టిక్కెట్ వస్తుందని, హ్యాట్రిక్ కొడతానని సన్నిహితుల వద్ద చెబుతున్నారని అంటున్నారు.

అయితే... ఈ దఫా ఆ టిక్కెట్ జనసేన ఖాతాలో అనే కామెంట్లు వినిపిస్తున్న వేళ.. ఆ పార్టీనుంచి కందుల దుర్గేష్ రెడీ అవుతున్నారని అంటున్నారు. ఆ రకంగా చూసుకున్నా... రాజమండ్రి రూరల్ లో జనసేనకు కూడా బలమైన ఓటు బ్యాంకే ఉండటంతో... ఈ సీటుపై ఆ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో కందుల దుర్గేష్ కు బుచ్చయ్య చౌదరి వర్గం ఏ మేరకు సపోర్ట్ చేస్తుందనేది వేచి చూడాలి.

ఆ సంగతి అలా ఉంటే... పొత్తులో భాగంగా చూసుకుంటే టీడీపీ - జనసేనలు ఈ స్థానంలో బలంగా ఉందనేది వాస్తవమనే చెప్పుకోవాలి. కాకపోతే టిక్కెట్ల సర్ధుబాటు సమయంలో కార్యకర్తల మధ్య, నేతల మధ్య మనస్పర్ధలు లేకుండా చూసుకోవడం అధినేతల బాధ్యతగా ఉంది. కారణం... రాజకీయాల్లో ప్రతీసారీ 1 + 1 = 2 కాదనేది తెలిసిన విషయమే కదా!

మరోపక్క అధికార వైసీపీ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కు రాజమండ్రి రూరల్ టిక్కెట్ కేటాయించారు జగన్! వాస్తవానికి వేణుగోపాల్... రామచంద్రాపురం నియోజకవర్గంపై మొదట మనసుపడ్డారని కథనాలొచ్చాయి. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ తో వేణు వర్గాన్ని కాంప్రమైజ్ చేయడంతో అది కాస్తా టీకప్పులో తుఫానుగా మారిందనేది తెలిసిన విషయమే!

దీంతో ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉందని చెబుతున్న వేళ... వేణుగోపాల్ రాజమండ్రిలోని పార్టీ శ్రేణులతో చర్చలు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. మరి... టీడీపీ - జనసేన కూటమికి బలమైన నియోజకవర్గంగా చెబుతున్న రాజమండ్రి రూరల్ లో వేణుగోపాల్ ఏ మేరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాలి. ఏది ఏమైనా... ఈసారి వేణుకు రూరల్ లో జగన్ బిగ్ టాస్కే ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు.