Begin typing your search above and press return to search.

ఈ బీరులో రసాయనిక అవశేషాలు.. రూ.25 కోట్ల విలువ చేసే స్టాక్‌ వెనక్కి!

అయితే కింగ్‌ ఫిషర్‌ స్ట్రాంగ్‌ బీర్, అల్ట్రా ల్యాగ్‌ బీరుల్లో రసాయనిక అవశేషాలు ఉన్నాయని వెల్లడైంది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 8:26 AM GMT
ఈ బీరులో రసాయనిక అవశేషాలు.. రూ.25 కోట్ల విలువ చేసే స్టాక్‌ వెనక్కి!
X

రెండు తెలుగు రాష్ట్రాల మద్యపాన ప్రియులు ఇష్టంగా తాగే బీర్లలో ప్రముఖమైంది.. కింగ్‌ ఫిషర్‌. ఇందులో లైట్, స్ట్రాంగ్‌ వేరియంట్లకు ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే తాజాగా రూ.25 కోట్ల విలువ చేసే కింగ్‌ ఫిషర్‌ బీర్లను అధికారులు వెనక్కి తీసుకోవడం, స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో కింగ్‌ ఫిషర్‌ బీర్‌ తయారవుతోంది. యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ ఈ బీరును తయారు చేస్తోంది. అయితే కింగ్‌ ఫిషర్‌ స్ట్రాంగ్‌ బీర్, అల్ట్రా ల్యాగ్‌ బీరుల్లో రసాయనిక అవశేషాలు ఉన్నాయని వెల్లడైంది. ఈ మేరకు ఆ బీర్లకు రసాయన పరీక్ష చేశామని.. అవి తాగడానికి పనికిరావని కర్ణాటక సీనియర్‌ ఎక్సైజ్‌ అధికారి ఒకరు తెలిపారు. దీంతో రూ. 25 కోట్ల విలువైన రెండు కింగ్‌ ఫిషర్‌ బీర్‌ బ్రాండులను రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. యునైటెడ్‌ బ్రూవరీస్‌ పై కేసు నమోదు చేయడమే కాకుండా, స్టాక్‌ను ధ్వంసం చేయడానికి శాఖ చర్యలు ప్రారంభించిందని మైసూరు రూరల్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎ రవిశంకర్‌ తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 17న యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ కు చెందిన నంజన్‌ గూడ్‌ యూనిట్‌ లో కింగ్‌ఫిషర్‌ స్ట్రాంగ్‌ బీర్, కింగ్‌ ఫిషర్‌ అల్ట్రా లాగర్‌ బీర్‌ బ్యాచ్‌ నంబర్‌ 7C, 7E తయారయ్యాయి. అయితే వీటిని పరీక్షకు పంపగా రసాయినిక అవశేషాలు ఉన్నట్టు వెల్లడైంది. మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి ల్యాబ్‌ టెస్ట్‌ రిపోర్టు వచ్చే వరకు స్టాక్‌ను సీజ్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు.

పూర్తి ల్యాబ్‌ రిపోర్టు తర్వాత కూడా ఆ బీర్లు వినియోగానికి పనికిరావని తేలితే వాటిని నాశనం చేస్తారు. ఈ బీర్ల విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుంది.

అయితే కంపెనీ వివరణ మరోలా ఉంది. కింగ్‌ ఫిషర్‌ స్ట్రాంగులో ఎలాంటి ఇబ్బంది లేదని.. కేవలం కింగ్‌ ఫిషర్‌ అల్ట్రాలోనే స్వల్పంగా పొగ మంచులాంటిది చేరిందని పేర్కొంది. అయినప్పటికీ తాము అధికారుల విచారణకు సహకరిస్తున్నామని తెలిపింది.