వణికిస్తున్న ఫెయింజల్.. చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత
శనివారం సాయంత్రం 5 గంటల వరకు చెన్నై ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
By: Tupaki Desk | 30 Nov 2024 9:43 AM GMTబంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీనికి ఫెయింజల్ అని నామకరణం చేయగా.. మరికొన్ని గంటల్లోనే ఈ తుఫాను తీరం దాటనుంది. తమిళనాడు, పుదుచ్చేరి వైపు ఈ తుఫాను దూసుకొస్తోంది. దీంతో వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు తమిళనాడు-పుదుచ్చేరి తీరం వద్ద గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఫెయింజల్ తుఫాను తీరం దాటనున్నట్లు వెదర్ రిపోర్టులో అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ఈ తుఫాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాజధాని చెన్నై నగరం కూడా ఇప్పటికే జలమయం అయింది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతోపాటు రెడ్అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. చెన్నై నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే సెలవులు ఇచ్చేసింది. మరోవైపు.. సాఫ్ట్‌వేర్ సంస్థలు, ప్రైవేటు ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోం అందబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వారంతా ఇప్పుడు ఇళ్ల నుంచే వర్క్ చేస్తున్నారు.
ఫెయింజల్ తుఫాన్ భయపెడుతుండడం.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టును కూడా తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలోనే 22 విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు చెన్నై ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
బలమైన ఈదురుగాలులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక.. ఇప్పటికే పలు విమానాలు వాయిదా పడడం.. పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. మరికొన్ని విమానాలు ఆలస్యంగా ప్రయాణించాయి. ఇంకొన్ని చెన్నై నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలను పక్కనే ఉన్న బెంగళూరుతోపాటు ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు.
మరోవైపు.. చెన్నై ఎయిర్‌పోర్టులో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. అబుదాబి నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చే ఇండిగో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. సింగపూర్ నుంచి వచ్చే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని టెక్నికల్ సమస్య కారణంగా రద్దు చేశారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రతికూల వాతావరణంతో రద్దు చేశారు.