వైద్యుడిపై కత్తితో దాడి.. తల్లికి మెరుగైన వైద్యం అందించలేదని!
ఆస్పత్రికి వెళ్లిన విఘ్నేష్ వైద్యుడు బాలాజీ జగన్నాథన్‌తో గొడవపడ్డాడు. కోపాన్ని ఆపుకోలేక సదరు వైద్యుడిపై దాడి చేశాడు.
By: Tupaki Desk | 13 Nov 2024 12:30 PM GMTతమిళనాడులోని చెన్నై నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన తల్లికి సరైన వైద్యం అందించలేదని ఓ యువకుడు ప్రభుత్వ వైద్యుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఏకంగా ఏడుసార్లు కత్తితో పొడిచి పైశాచికత్వాన్ని చాటాడు.
ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని 26 ఏళ్ల యువకుడైన పెరుంగళత్తూరుకు చెందిన విఘ్నేష్ చెన్నై నగరంలోని గిండీ ప్రాంతంలో గల కలైంజర్ సెంటినరీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఔట్ పేషెంట్ విభాగంలో హాస్పిటల్‌లో చేర్పించాడు. ఈ ఏడాది మే నెల నుంచి నవంబర్ వరకూ అదే ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. ఆరు నెలలపాటు చికిత్స చేసినా తన తల్లి ఆరోగ్యం ఏ మాత్రం బాగుపడలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఆస్పత్రికి వెళ్లిన విఘ్నేష్ వైద్యుడు బాలాజీ జగన్నాథన్‌తో గొడవపడ్డాడు. కోపాన్ని ఆపుకోలేక సదరు వైద్యుడిపై దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో సుమారు ఏడు సార్లు విచక్షణ కోల్పోయి పొడిచాడు. వైద్యుడి చాతి పైభాగం, ముఖం, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ వైద్యుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే.. దాడి చేసిన అనంతరం ఆ యువకుడు పారిపోయే ప్రయత్నం చేయగా.. సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఇక.. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియమ్ కూడా స్పందించారు. ఆసుపత్రిని పరిశీలించారు. చికిత్స పొందుతున్న వైద్యుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. మరోవైపు.. ఈ ఘటనను సీఎం స్టాలిన్‌కు సుబ్రమణియమ్ వివరించగా.. ఆయన విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఆయన ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు.