Begin typing your search above and press return to search.

చెన్నై ఐఐటీ విద్యార్థి ఘనత.. శ్వాసతో సెల్ ఫోన్ అన్ లాక్!

ఇప్పుడు అందుకు భిన్నంగా శ్వాసతోనూ అన్ లాక్ చేసే టెక్నాలజీని కనిపెట్టాడు మద్రాస్ ఐఐటీకి చెందిన రీసెర్చ్ విద్యార్థి ఒకరు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 6:30 AM GMT
చెన్నై ఐఐటీ విద్యార్థి ఘనత.. శ్వాసతో సెల్ ఫోన్ అన్ లాక్!
X

జీవితంలో భాగమైన సెల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించమంటే.. కష్టం బాస్ అని ఒక్క ముక్కలో తేల్చేస్తాం. అలాంటి సెల్ ఫోన్ కు సంబంధించిన ఒక కీలక అంశాన్ని తాజాగా కనిపెట్టాడో విద్యార్థి. పరిశోధక విద్యార్థిగా ఉన్న అతను సాధించిన ఘనత గురించి తెలిస్తే.. అప్రయత్నంగా వావ్ అన్న మాట రావటం ఖాయం. ఇప్పటివరకు సెల్ ఫోన్ అన్ లాక్ అంటే.. అయితే ప్యాట్రన్.. లేదంటే నెంబర్ ద్వారా.. కాదంటే టచ్ తోనూ.. లేదంటే ఐరీష్ తోనూ ఉంటుంది. ఇప్పుడు అందుకు భిన్నంగా శ్వాసతోనూ అన్ లాక్ చేసే టెక్నాలజీని కనిపెట్టాడు మద్రాస్ ఐఐటీకి చెందిన రీసెర్చ్ విద్యార్థి ఒకరు.

ప్రపంచంలోని ఒకరి వేలిముద్ర మరొకరికి ఎలా సరిపోదో.. ఒకరి కనుపాప మరొకరికి ఉండదో.. అలానే ప్రతి వ్యక్తి శ్వాస విడిచే విధానం ఒక్కోలా ఉంటుందన్న పాయింట్ ఆధారంగా చేసుకొని ఈ సరికొత్త టెక్నాలజీని తయారు చేశాడు. శ్వాసతో ఫోన్ ను అన్ లాక్ చేసేలా మద్రాస్ ఐఐటీకి చెందిన రీసెర్చ్ విద్యార్థి ముకేశ్ సరికొత్త సాంకేతికతను సిద్ధం చేస్తున్నాడు. ఈ టెక్నాలజీని అప్లికేషన్ గా డెవలప్ చేసిన తర్వాత.. సెల్ ఫోన్ అన్ లాక్ తో పాటు భద్రతా పరమైన కార్యకలాపాలకు ఉపయోగించొచ్చని చెబుతున్నారు.

ముకేశ్ డెవలప్ చేస్తున్న టెక్నాలజీ వైద్య రంగానికి సాయం చేస్తుందని చెబుతున్నారు. ఇంతకూ ఈ టెక్నాలజీ మొత్తం ఒక కీలకమైన పాయింట్ తో ముడి పడి ఉంటుంది. ఆ విషయాన్ని వివరిస్తున్న ముకేశ్ ఏమంటారంటే.. ‘‘ఒక వ్యక్తి ఊపిరి వదిలేటప్పుడు శ్వాసకోశం ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తుంది. ప్రతి మనిషికి ఆ శ్వాసకోశంలో తేడా ఉంటుంది. గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తిని వేరు చేయటం సాధ్యమవుతుంది. దీన్ని టెక్నాలజీగా మార్చటం ద్వారా మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి’’ అని చెబుతున్నారు.

శ్వాసకోస సమస్యలతో బాధ పడే వారికి ఇన్ హేలేషన్ థెరపీకి ఈ విధానం సాయం చేస్తుందని చెబుతున్నారు. ఈ సమస్యతో ఇబ్బంది పడే వ్యక్తికి ఎంత మోతాదులో ఔషధాన్ని ఇవ్వాలో నిర్ణయించుకునేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు. మొత్తంగా సెల్ ఫోన్ తెరిచే విధానానికి సంబంధించి విప్లవాత్మకమైన మార్పును ఈ కొత్త విధానం (ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది) అమల్లోకి వస్తే.. సెల్ ఫోన్ కు సంబంధించి భద్రతకు మరింత భరోసా ఖాయమని చెప్పక తప్పదు.