Begin typing your search above and press return to search.

ఇదెక్కడి పితలాటకం.. వాసు వర్సెస్‌ చెవిరెడ్డి!

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రకాశం జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. 2014, 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఈ జిల్లాలో వైసీపీ గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   17 July 2024 9:53 AM GMT
ఇదెక్కడి పితలాటకం.. వాసు వర్సెస్‌ చెవిరెడ్డి!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రకాశం జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. 2014, 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఈ జిల్లాలో వైసీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి 11 స్థానాలే వచ్చాయి. ఇందులో రెండింటిని ప్రకాశం జిల్లాలోనే గెలుచుకుంది. యర్రగొండపాలెం, దర్శి అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకోగలిగింది.

కాగా ప్రకాశం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారిందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జిల్లాలో బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆయన బావ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడిచిందనే గాసిప్స్‌ ఉన్నాయి. పలుమార్లు ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరికి సర్దిచెప్పాల్సి వచ్చిందని అంటున్నారు.

గతంలో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి (వాసు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌ మరణం అనంతరం రోశయ్య మంత్రివర్గంలోనూ కొనసాగారు. జగన్‌ వైసీపీని ఏర్పాటు చేశాక ఆయనకు మద్దతుగా తన మంత్రి పదవిని వదులుకున్నారు.

ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో బాలినేని శ్రీనివాసులరెడ్డే చక్రంతిప్పేవారు. అయితే తన బావ వైవీ సుబ్బారెడ్డి కూడా రాజకీయాల్లోకి రావడం, ఆయన స్వయంగా వైఎస్‌ జగన్‌ కు బాబాయ్‌ కావడంతో జిల్లాపై బాలినేని పెత్తనం సడులుతూ వచ్చిందనే టాక్‌ ఉంది.

ఇటీవల ఎన్నికల సందర్భంగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డినే బరిలోకి దించాలని బాలినేని గట్టిగా పట్టుబట్టారు. ఆయనకు సీటు ఇవ్వకపోతే పార్టీ నుంచి తాను తప్పుకుంటాననే వరకు వ్యవహారం వెళ్లిందని ప్రచారం జరిగింది. అయినప్పటికీ వైఎస్‌ జగన్‌.. మాగుంట శ్రీనివాసులరెడ్డికి సీటు ఇవ్వలేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు.

చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించడం తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి సర్దుకుపోయారని అంటారు. అలాగే తాను చెప్పిన కొందరు అభ్యర్థులకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వకపోయినా మిన్నకుండిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన బాలినేని, ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇద్దరూ ఓటమి పాలయ్యారు.

దీంతో చెవిరెడ్డి జిల్లా నుంచి తన సొంత జిల్లా చిత్తూరుకు వెళ్లిపోతారని వాసు భావించారు. అయితే చెవిరెడ్డి వెళ్లకుండా ప్రకాశం జిల్లాలోనే మకాం వేశారు. ఎన్నికల అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన జిల్లా అంతటా పర్యటిస్తున్నారు. అలాగే టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను పరామర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమిస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బాలినేని వాసు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని సమాచారం. ఆయన జనసేన పార్టీలోకి వెళ్లిపోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అలాగే టీడీపీలో చేరడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్‌ నడిచింది. అయితే ఈ వార్తలను బాలినేని ఖండించారు. చెవిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారన్న వార్తలపై స్పందిస్తూ ఎవరినో తీసుకొచ్చి అధ్యక్షుడిగా వేయడానికి జిల్లా ఏమీ గొడ్డు పోలేదని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి చెవిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం వాసుకు ఇష్టం లేదని చర్చ నడిచింది.

చెవిరెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత జిల్లాకు వెళ్లిపోదామనుకున్నారని.. అయితే వైవీ సుబ్బారెడ్డే ఆయనను వెళ్లనీయకుండా అడ్డుపడ్డారనేది బాలినేని అనుమానమంటున్నారు. తన పెత్తనం కొనసాగకుండా ఉండటానికి చెవిరెడ్డిని వైవీ సుబ్బారెడ్డే ముందుండి నడుపుతున్నారని వాసు భావిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. పార్టీలో ఉండే వీటిని తేల్చుకోవాలని ఆయన అనుకుంటున్నారు. మరి జగన్‌ ఈ సమస్యకు ఏ పరిష్కారం చూపుతారో!