Begin typing your search above and press return to search.

చంద్రగిరిలో ముసుగు వీరులు... చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో గతకొన్ని రోజులుగా జరుగుతున్న ఘర్షణ వాతావరణాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 July 2024 4:30 PM GMT
చంద్రగిరిలో ముసుగు వీరులు... చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
X

ఏపీలో గతకొన్ని రోజులుగా జరుగుతున్న ఘర్షణ వాతావరణాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... రాష్ట్రంలో అరాచకం స్వైరవిహారం చేస్తుందని ఒకరంటే.. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో మీడియాతో మట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. చంద్రబాబు, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఐదేళ్ల వైసీపీ పాలనలో తాము ఏనాడూ పులవర్తి నానీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని.. ఆయన మాత్రం ఎమ్మెల్యే అయ్యినప్పటినుంచీ తమపై కక్ష సాధింపు పనిలేనో ఉన్నాడని చెవిరెడ్డి ఆరోపించారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా కాలేదని.. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 35 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరిగాయని చెవిరెడ్డి ఆరోపించారు. వాస్తవానికి చంద్రగిరి నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం అని.. అలాంటి చోట ప్రజలు నేడు భయపడి తిరగాల్సిన పరిస్థితి ఎదురైందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే... ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైసీపీ కార్యకర్తలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారని.. ఎక్కడపడితే అక్కడ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని.. దాడులు చేసినవారిని గుర్తుపట్టకుండా ముఖాలకు ముసుగులు వేసుకుని వచ్చి చితకబాదుతున్నారని చెవిరెడ్డి సంచలన ఆరోపణలు!

ఈ సందర్భంగా... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పులవర్తి నానీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తాము వేధించలేదు సరికదా.. మైనింగ్ వ్యాపారానికి సాయం చేశామని.. ఆ మైనింగ్ వ్యాపారం అడ్డుకోవడానికి తాము ఏనాడూ ప్రయత్నాలు చేయలేదని చెవిరెడ్డి చెప్పారు. నేడు పులవర్తి నాని మైనింగ్ కంపెనీకి చెందిన లారీలు తమిళనాడు, కర్ణాటకలో స్వేచ్చగా తిరగడానికి తామే సహాయం చేశామని అన్నారు.

ఒకవేళ తాను చెప్పేది అసత్యమైతే... టీడీపీ నాయకుడు పులవర్తి నాని, గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర, తన దగ్గరా సహాయం తీసుకోలేదని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది.