Begin typing your search above and press return to search.

రన్ వేపై ల్యాండ్ అవుతుంటే అడ్డంగా మరో విమానం... వైరల్ వీడియో!

ఇదే సమయంలో.. ఇటీవల అల్సెస్కా నుంచి ఒక పైలెట్, 9 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Feb 2025 10:02 AM GMT
రన్  వేపై ల్యాండ్  అవుతుంటే అడ్డంగా మరో విమానం... వైరల్  వీడియో!
X

ఇటీవల అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల వాషింగ్టన్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రన్ వేపై దిగేందుకు వస్తున్న పీ.ఎస్.ఏ. ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానాన్ని సైనిక హెలీకాప్టర్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదే సమయంలో.. ఇటీవల అల్సెస్కా నుంచి ఒక పైలెట్, 9 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. అనంతరం సముద్రపు మంచు మీద విమానం శిథిలాలు కనిపించాయని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో... జనవరి 31న ఫిలడెల్ఫియాలో ఒక విమానం కూలిపోయింది.

ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు వ్యక్తులు, నేలపై ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు. ఇలా వరుస విమాన ప్రమాదాలు అగ్రరాజ్యాన్ని ఆందోళన పెడుతోన్న వేళ.. తాజాగా ల్యాండ్ అవుతున్న ఓ విమానానికి రన్ వేపై అడ్డంగా మరో విమానం కనిపించిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో షాకింగ్ గా మారింది.

అవును... ఇటీవల వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న వేళ.. అమెరికాలో మరో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఇషికాగో మిడ్ వే ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రెండు విమానాలు దాదాపు ఢీకొనే పరిస్థితి నెలకొంది. అయితే.. పైలట్ చివరి నిమిషంలో చకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:47 గంటలకు సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం ఒమాహా నుంచి షికాగో మిడ్ వే ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఈ సమయంలో రన్ వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయానికి ఊహించని రీతిలో అదే రన్ వేపై ఓ ప్రైవేట్ జెట్ అడ్డంగా వెళ్తోంది.

దీంతో... దీన్ని గమనించిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.. అప్పటికే ల్యాండ్ అవుతోన్న విమాన చక్రాలు నేలను తాకగా.. వెంటనే తిరిగి దాన్ని మళ్లీ గాల్లోకి ఎగిరించారు. దీంతో... అతిపెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే.. రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి.. అది కూడా కొన్ని సెకన్ లలోనే!

ఈ సమయంలో పైలెట్ల అప్రమత్తతను పలువురు అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.